తమకు చెల్లించాల్సిన ఈఎస్ఐ, పీఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలని కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పురపాలక సంఘం పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. విధులు బహిష్కరించి సీఐటీయూ ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట బైఠాయించారు. కరోనా విజృంభనలోనూ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న తమకు కనీసం ఈఎస్‌ఐ సదుపాయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వేతనాల్లో ఈఎస్‌ఐ, పీఎఫ్, పేరిట కోతలు విధిస్తున్నప్పటికీ ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదని ఆరోపించారు. వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన పారిశుద్ధ్య కార్మికులకు సిర్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జీ డా.పాల్వాయి హరీశ్ బాబు మద్దతు తెలిపారు. కార్మికులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని అన్నారు. కార్మికులకు రావాల్సిన ఈఎస్‌ఐ బకాయిల విషయంలో 15 రోజుల్లోగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ శ్రీనివాస్ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: గూగుల్ పే కస్టమర్ కేర్ పేరుతో మోసం