సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప... తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు బాసటగా నిలిచారు. సొంత ఖర్చులతో ఇళ్లు నిర్మించి ఇస్తానని చెప్పి మంచి మనసు చాటుకున్నారు. కుమురం భీం జిల్లా పెంచికలపేట మండలం ఎలకపల్లి గ్రామానికి చెందిన రాజాం, రాజలక్ష్మి దంపతులకు ఆరుగురు సంతానం. తండ్రి రాజాం ఏడాది క్రితం అనారోగ్యంతో మరణించాడు. వారం క్రితం తల్లి కూడా అనారోగ్యంతో మరణించడంతో ఆరుగురు బాలికలు అనాథలయ్యారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప... సొంత ఖర్చులతో ఇళ్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. కోనప్ప ఆదేశాలతో కుమారుడు వంశీ... ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. వారికి కావాల్సిన నిత్యవసర సరుకులు అందజేశారు. చిన్నారుల విషయంలో మంత్రి కేటీఆర్ స్పందించి వారి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారని అన్నారు. ప్రభుత్వ పరంగా అన్నివిధాల చిన్నారులను ఆదుకుంటామని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు.