- పెద్దపులి ఫల్గుణ సంతతిలో ఒకటైన మగపులి(కే-6) రెండేళ్ల వయసు రాగానే స్థావరాన్ని ఏర్పాటుచేసుకుంది. ఇంతలో ఆకారంలో భారీగా కన్పించే బెబ్బులి(ఏ-1) ఒకటి మహారాష్ట్ర నుంచి వచ్చింది. ఆసిఫాబాద్ ప్రాంతంలో తిరుగుతూ కే-6ను తరిమేసింది. ఇప్పుడది ఎక్కడుందో పత్తా లేదు.
- రెండు కూనలతో తిరుగుతున్న ఓ తల్లిపులి ఇటీవల తెలంగాణ అటవీశాఖ కెమెరాల కంటికి చిక్కింది. మహారాష్ట్ర సరిహద్దులు దాటి వచ్చిన అది రాష్ట్ర భూభాగంలో ఐదారు కిలోమీటర్ల లోపలికి ప్రవేశించింది.
ఇవేనా.. ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పక్కనే, సుమారు 300 పులులున్న మహారాష్ట్రలో ఆవాసం, ఆధిపత్యం కోసం వాటిమధ్య తరచూ పోరాటాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు భీకరంగా సాగుతున్నాయి. ఆ పోరులో చిన్నవి, బలహీమైనవి ఓడిపోతున్నాయి. కొన్ని ఇతర ప్రాంతాలకు, మరికొన్ని పొరుగు రాష్ట్రాలకు వలసపోతున్నాయి.
వలసలకు కారణం ఏంటి?
సాధారణంగా మహారాష్ట్ర.. అప్పుడప్పుడు ఛత్తీస్‌గఢ్ నుంచి పులులు ప్రాణహిత, పెన్‌గంగ, గోదావరి నదులను దాటి తెలంగాణలోకి వస్తున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలో యువతి, యువకుడిని చంపిన ఏ2 పెద్దపులి మహారాష్ట్ర నుంచి వచ్చిందే. ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో కొద్దివారాలుగా 12-13 పెద్దపులులు సంచరిస్తుండగా.. ఇటీవల మూడు, నాలుగింటి జాడ కెమెరాలకు చిక్కట్లేదని తెలుస్తోంది. అవి ఆధిపత్య పోరులో ఓడి ఇతర ప్రాంతాలకు వెళ్లాయా? మరో కారణమా? అనేది తెలుసుకునేందుకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ‘కొత్త ఆవాసం దొరకని, ఆకలికష్టాలు పెరిగిన సమయంలో వాటి మానసిక ప్రవర్తన మారుతోంది. అదే అవసరానికి మించి వేటాడేలా, మనుషులపై దాడిచేసేలా వాటిని ప్రేరేపిస్తోందని’ నిపుణులు చెబుతున్నారు.
సంఖ్యకు సరిపోని అటవీ విస్తీర్ణం
సాధారణంగా ఒక్కో పులి అక్కడి ఆహార, నీటి వసతులను బట్టి 25-30 కి.మీ పరిధిలో స్థావరాన్ని ఏర్పరచుకుంటుంది. మహారాష్ట్రలో ప్రస్తుతం 312 పెద్దపులులు ఉన్నాయి. అటవీ విస్తీర్ణం చాలకపోవడం, పరిమితికి మించి సంతతి పెరగడం అక్కడ సమస్యగా ఉంది. ఈ క్రమంలో తెలంగాణలోకి వలసలు పెరుగుతున్నాయి. ‘చంద్రాపూర్ జిల్లాలో ఏటా 70 వరకు పులిపిల్లలు పుడుతున్నాయి. ఏటా 35 పులుల ఆవాసానికి కొత్త భూభాగం కావాల్సి వస్తోంది. ఈ క్రమంలో కొన్ని తల్లితోనూ పోరాడుతున్నాయి. ఆడతోడు కోసమూ పులులు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. కె-6 మగపులిని తరిమేసిన ఏ-1 పెద్దపులి.. ఫాల్గుణ సంతతిలో మిగిలిన కే-4, కే-8, కే-9లను వదిలేసింది. ఆడపులులు కావడం వల్లనే వాటి జోలికి వెళ్లలేదు. వలసపోతున్న పులుల్ని గుర్తించేందుకు రేడియో కాలర్లు ఏర్పాటుచేస్తున్నాం’ అని మహారాష్ట్ర అధికారి ఒకరు ‘ఈనాడు’కు వివరించారు.
ఇదీ చదవండి : తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయాలు