mangi village rtc service: ఆ గ్రామ ప్రజలు ఇప్పటి వరకు తమ ఊళ్లో ఆర్టీసీ బస్సును చూడలేదు. ఏ అవసరమొచ్చినా ప్రైవేటు వాహనమే దిక్కు.. అత్యవసర పరిస్థితి వచ్చిందంటే.. రాళ్లు, రప్పలు తేలిన దారిలో ప్రాణాలు నిలిపేందుకు ఓ యుద్ధమే చేయాలి. తమ గ్రామం ఏర్పడి సుమారు 26 ఏళ్లయినా బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కుమురం భీం జిల్లా తిర్యాణి మండలం మంగి గ్రామస్థులు.
మంగి గ్రామం దట్టమైన అటవీ ప్రాంతం నడుమన ఉంది. సరైన రోడ్డు వసతి లేదు. కనీసం ద్విచక్రవాహనంపై కూడా ప్రయాణం చేయలేని పరిస్థితి. ఈ గ్రామానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న బస్తిర్యాణి మండలంలోనే గతేడాది మావోయిస్టులు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ గ్రామానికి నిత్యావసర సరుకులు, రేషన్ సరుకులు తరలించడం కూడా కష్టమైన పని. అయితే ఈ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న 30 గ్రామాలకు ఇదే ప్రధాన రహదారి. ప్రజలు తాము పడుతున్న ఇబ్బందిని స్థానిక పోలీసులకు తెలిపారు. ప్రజల సమస్యలపై స్పందించిన స్థానిక పోలీసులు వారికి అవగాహన కల్పించి రహదారిని చదును చేయించి.. మొరం వేయించారు. సుమారు నెలరోజుల పాటు గ్రామస్థుల శ్రమదానంతో రోడ్డు తయారైంది.
గ్రామస్థుల ఇబ్బందులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లిన జిల్లా అధికారులు.. పై అధికారుల నుంచి అనుమతి రావడం వల్ల జిల్లా కేంద్రం నుంచి చిత్రకుంట, తిర్యాణి మీదుగా.. మంగి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు. తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించిన ఆర్టీసీ యాజమాన్యానికి, స్థానిక ఎస్సై రామారావును జిల్లా ఎస్పీ అడ్మిన్ వైవీ సుధీంద్ర అభినందించారు. గ్రామానికి వచ్చిన బస్సుకు పూజలు చేసి.. మేళ తాళాల నడుమ బస్సుకు స్వాగతం పలికారు.
ఇదీ చూడండి: మరో పాటతో వచ్చిన సీఐ నాగమల్లు.. ఈసారి మత్తు వదలగొట్టేందుకు..