కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం సిర్పూర్ టి మధ్య ఆర్.అండ్.బి రహదారికి ఇరువైపులా పెద్దబండ దగ్గర దాదాపు 42 చెట్లు నరికివేతకు గురవడం కలకలం సృష్టిస్తోంది. ఇందులో అధికార పార్టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రమేయం ఉందంటూ స్థానిక ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు డా. పాల్వాయి హరీష్ బాబు ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు. స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్విట్టర్ వేదికగా... ఒకవైపు తెరాస ప్రభుత్వం హరిత హారం కార్యక్రమం చేపడుతుంటే మరోవైపు సిర్పూర్ నియజకవర్గంలో హరిత హననం జరుగుతుందంటూ విమర్శలు గుప్పించారు.
చెట్ల నరికివేతతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చెబుతున్నప్పటికీ.. ఎమ్మెల్యే అనుచరులు మాత్రం తాము ఆర్.అండ్.బి. శాఖ నుంచి టెండర్ల ద్వారా చెట్లు దక్కించుకున్నామని అంటున్నారు. ఈ ఘటన జరిగి పది రోజులుకావస్తున్నప్పటికీ... ఈ తతంగం పై అటవీశాఖ అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. ప్రభుత్వం ఒకపక్క హరిత హారాన్ని ప్రాథమిక సూత్రంగా వివరిస్తుంటే... మరోపక్క వృక్షాలను నరికివేసే విషయంలో అధికారుల నాన్చుడు ధోరణి అవలంభించడం అనుమానాలకు తావిస్తోంది.
ఇవీ చూడండి: 'వానాకాలంలో పంట మార్పడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'