తొలిసారి ర్యాంకు
పురపాలికలో పారిశుద్ధ్యం, పరిపాలన ఇతర అంశాల ద్వారా అభిప్రాయ సేకరణ చేసి, ర్యాంకులు ప్రకటిస్తారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పురపాలికలో 30 వార్డులు, 12,454 నివాస గృహాలు, 54,734 జనాభా ఉంది. కొన్నేళ్లుగా ఈ పురపాలిక ర్యాంకులు సాధించలేకపోయింది. తొలిసారిగా 74వ ర్యాంకు సాధించింది.
కొంత మెరుగు
పారిశుద్ధ్యం పనులు గతంలో కంటే కొంత మెరుగ్గా ఉన్నాయి. పురపాలికలోని రెండు శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టులు కొన్నేళ్లుగా ఖాళీగా ఉండగా, చిరు ఉద్యోగిని ఇన్‌ఛార్జిగా నియమించి, పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇటీవలే ఇంటింటా చెత్త సేకరణకు ఒక్కో ఇంటికి రెండు చెత్తబుట్టలను అందజేశారు. ఏడు ఎలక్ట్రికల్ ట్రాలీలు, ఇటీవలే మరో మూడు ట్రాలీలను కొనుగోలు చేశారు. అయితే పూర్తి స్థాయిలో చెత్తను ఈ ట్రాలీల ద్వారా సేకరించడం లేదనే ఆరోపణలున్నాయి.
పట్టణంలోని కాగజ్‌నగర్ మండలం కోసిని, సర్‌సిల్క్ ఏరియాల్లో రెండు డంపింగ్‌యార్డులు ఉన్నాయి. తడి, పొడి చెత్త సేకరణ, చెత్త తరలింపులో వాహనాల సమస్య పురపాలికను వేధిస్తున్నాయి. మరోవైపు పారిశుద్ధ్యం సిబ్బంది కొరత, విధుల సమస్య, పలు కీలక పోస్టుల ఖాళీలు, తదితర కారణంగా బల్దియాలో వంద శాతం పారిశుద్ధ్యం అమలుకు నోచుకోకపోవడంతోనే ర్యాంకులో కొంత మేరకు వెనుకబడింది.
ప్లాస్టిక్ కవర్ల నివారణకు చర్యలు
ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ కవర్ల నియంత్రణలో అధికారులు కొంతమేరకు చర్యలు తీసుకున్నారు. పట్టణంలో ప్రత్యేకంగా కమిటీని నియమించి, నివారణకు చర్యలు తీసుకున్నారు. ప్లాస్టిక్ కవర్లను విక్రయించే 98 మందిపై కేసు నమోదుతోపాటు, దాదాపు రూ.40 వేల జరిమానాను వసూలు చేశారు. ప్రస్తుతం పట్టణంలో కొంతమేరకు నిషేధిత ప్లాస్టిక్ కవర్ల వాడకం తగ్గింది.
సేంద్రియ ఎరువుల తయారీకి సన్నాహాలు
పురపాలికలో డంపింగ్‌యార్డుల్లో చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీ వెనుకబడింది. రోజుకు పట్టణంలో దాదాపు 20 మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతోంది. ఆ చెత్తను వాహనాలతో డంపింగ్‌యార్డులకు తరలిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చడం ద్వారా పురపాలికకు పరిశుభ్రతతో పాటు, ఆదాయం కూడా సమకూరనుంది. ఆ దిశగా పురపాలిక చర్యలు చేపడితే భవిష్యత్తులో ఉత్తమ ర్యాంకు సాధించే అవకాశం ఉంది.
ఉత్తమ ర్యాంకు సాధనకు కృషి
ప్రస్తుతం 74వ ర్యాంకు వచ్చింది. భవిష్యత్తులో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు పాలకవర్గం సభ్యులు, అధికారులు, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సహకారంతో కృషి చేస్తాం. తడి, పొడి చెత్తను వేరు చేసి, సేంద్రియ ఎరువుల తయారీకి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే ఆ ప్లాంటు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.
- శ్రీనివాస్, కమిషనర్
ఇదీ చదవండి: భద్రాద్రి @ 44.6: గోదారి తగ్గుముఖం... నీటిలోనే మన్యం