కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పలు చోట్ల భారీగా వర్షం కురిసింది. ఆసిఫాబాద్ మండలంలోని కుమురంభీం, వట్టివాగు ప్రాజెక్టుల్లోకి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు కుమురంభీం ప్రాజెక్టు 3 గేట్లు, వట్టివాగు 1 గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు.
కుమురంభీం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 241.500 మీటర్లకు వరద నీరు చేరింది. వట్టివాగు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 239.500 మీటర్లకు ప్రస్తుతం 239.00 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 435 క్యూసెక్కుల నీరు చేరగా.. ఒక గేటు ఎత్తి 250 క్యూసెక్కుల నీరు బయటకు విడుదల చేస్తున్నారు. జిల్లాలోని రెండు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.