వర్షాకాలంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి సమీపాన ఉన్న గుండి గ్రామస్థుల ఇబ్బందులు వర్ణణాతీతం. పంటపొలాలకు వెళ్లాలన్నా... జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా.. ఏచిన్న అవసరం వచ్చినా పెద్ద వాగు దాటాల్సిందే. మిగతా సమయంలో అయితే వాగు దిగి వెళ్లిపోవచ్చు. కానీ వర్షకాలం వచ్చిందంటే ప్రవాహం ఉద్ధృతంగా ఉంటుంది. ఏ అత్యవసరమొచ్చినా ఈ వాగు దాటాల్సిందే. వరద ఉద్ధృతి సమయంలో గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. థర్మకోల్‌తో ఏర్పాటు చేసిన తెప్పలపై ప్రమాదకర స్థితిలో వాగు దాటుతున్నారు.
వంతెన లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఈ వంతెన ప్రారంభించి 15ఏళ్లవుతోంది. గర్భిణులు చాలా ఇబ్బందిపడుతున్నారు. దయచేసి ఈ వంతెనను త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నాం. జాబరి అరుణ, గ్రామ సర్పంచ్.
వాగు అవతల ఉన్న అయిదు గ్రామాలకు చెందిన విద్యార్థులు, రైతులు, రోజువారి కూలీలు ఆసిఫాబాద్‌కు వస్తుంటారు. ఇటీవల ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలోని కుమురం భీం ప్రాజెక్ట్‌లో వరద నీరు పెరుగుతోంది. ప్రాజెక్టు నుంచి నీటిని కిందికి విడుదల చేయడం వల్ల గుండి పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో థర్మకోల్‌తో తయారు చేసిన తెప్పలపైనే ప్రమదకర పరిస్థితిలో వాగు దాటుతున్నారు. ఏమాత్రం అదుపుతప్పినా నీటిలో కొట్టుకు పోయే ప్రమాదం ఉంది. ఇలా జరిగిన ఘటనలు గతంలో చాలానే ఉన్నాయి.
కాలేజికి వెళ్లాలన్నా, ఆసిఫాబాద్ వెళ్లాలన్నా ఈ వాగు దాటాల్సిందే. వర్షాకాలం వచ్చిందంటే మా కష్టాలు వర్ణణాతీతం. పాఠశాలలకు సమయానికి వెళ్లలేక చాలాసార్లు తిట్లుతిన్న సందర్భాలు ఉన్నాయి. ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తున్నాయి. నేతలు హామీలు ఇస్తున్నారు.. వంతెన అలాగే ఉంటుంది. నీళ్లు ఎక్కువగా ఉంటే తిరిగి సుమారు 30 కిలోమీటర్లు తిరిగి పోవాల్సి వస్తుంది. ఈ బ్రిడ్జి ఉంటే 3కిలోమీటర్లలో వెళ్లిపోవచ్చు. శ్రీకాంత్, విద్యార్థి.
ఈ వాగుపై వంతెన నిర్మాణానికి 2012లో శిలాఫలకం వేశారు. 2012లోనే 3 కోట్లతో టెండర్లు పిలిచి తర్వాత 11 కోట్లకు పెంచారు. అయినప్పటికీ నేటికీ నిర్మాణం పూర్తి కాలేదు. ఎన్నో ప్రభుత్వాలు మారినా, పాలకులు మారిన గుండి గ్రామస్థుల తలరాతలు మాత్రం మారలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఓట్లు దండుకోవడానికి వస్తారే తప్ప తమ గోడు పట్టించుకునేవారే కరవయ్యారని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి గుత్తేదారులతో మాట్లాడి వంతెన నిర్మాణం పూర్తిచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
పొలానికి పోవాలన్నా, ఆస్పత్రికి పోవాలన్నా, ఏ అవసరమొచ్చినా ఆసిఫాబాద్‌కు వెళ్లాలి. అయితే ఈ వాగులో నీరు ఎక్కువగా ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. 15 ఏళ్ల క్రితం బ్రిడ్జి పనులు ప్రారంభించారు. ఇప్పటికీ పూర్తికాలేదు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు చాలా కష్టపడుతున్నారు. బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలి. గ్రామస్థురాలు.
ఇదీ చూడండి: Nzb Rains: జోరువానలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు