Forest Lands Issue: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలో అటవీ భూముల స్వాధీనపరచుకోవడానికి అటవీశాఖ అధికారులు యత్నించారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను అధికారులు ఉన్నపళంగా లాక్కుంటే.. తమకు దిక్కేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 35 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఈ భూములను ప్రభుత్వం లాగేసుకుంటే తాము ఎలా బతకాలని వాపోయారు.
అటవీ భూముల చదునుకు వచ్చిన అధికారులు
కాగజ్ నగర్ మండలం కడంబ అటవీ క్షేత్రం పరిధిలోని కంపార్టుమెంట్ 121, 130లలో సుమారు 150 ఎకరాల అటవీ భూమి ఉంది. ఈ భూముల్లో స్థానిక ప్రజలు కొన్నేళ్లుగా వ్యవసాయం చేస్తూ వస్తున్నారు. గత కొద్ది కాలం అటవీ పెంపుపై దృష్టి సారించిన అధికారులు అక్రమంగా సాగు చేస్తున్న అటవీ భూములను గుర్తించి స్వాధీనపరచుకుని మొక్కల పెంపకం చేపట్టడానికి రూపకల్పన చేశారు. ఈ నేపథ్యంలో కడంబ అటవీప్రాంతంలో సుమారు 150 ఎకరాల భూమిని గుర్తించగా.. కంపార్టుమెంట్ 121లో గల 70 ఎకరాలను ట్రాక్టర్లతో చదును చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఉద్రిక్తతలు నెలకొనే అవకాశం ఉండటంతో ముందస్తుగా పోలీస్ బందోబస్తుతో అటవీ క్షేత్రం వద్దకు వచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ట్రాక్టర్లను అడ్డుకునేందుకు యత్నించారు.
భూములు లాక్కుంటే ఎలా బతకాలి సారూ..!
ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను తీసుకుంటే తాము ఎలా బతికేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నిరోజుల నుంచి అడ్డుకోని అటవీ అధికారులు గత రెండేళ్లుగా తమను అడ్డుకుంటూ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. ఈ విషయమై ఎఫ్ఆర్వో శివకుమార్‌ను సంప్రదించగా స్పందించలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము ఇక్కడకు వచ్చామని తెలిపారు.
భూమి లేకుంటే మాకు ఆధారం లేదు..
35 ఏళ్ల నుంచి ఈ భూమిని దున్నుకుని బతుకుతున్నాం. గత రెండు సంవత్సరాల నుంచి ఈ అధికారులు మా వెంట పడుతున్నారు. ఇప్పుడు వెళ్లిపోమంటే మేమెలా బతకాలి సారూ. మాకు ఏ ఆధారం లేదు. మాకు బతుకేలేదు. -శంకర్, కడంబ గ్రామస్థుడు
సాయం చేయండి సారూ..
మా అమ్మనాన్నల నుంచి ఈ భూమిని సాగు చేసుకుంటూ బతుకుతున్నాం. వారు ఇప్పుడు లేరు. మా అన్న, నేను ఆ భూమిని సాగు చేసుకుంటూ బతుకుతున్నం. భూమి ఉంటే సాగు చేసుకుని మా పిల్లలను సాదుకుంటాం. అధికారులందరిని వేడుకుంటున్నాం. మాకు ఏదైనా సాయం చేయమని ప్రాధేయపడుతున్నాం. కొన్ని నెలల పాటు ఆగితే ఏదో ఒక ఆధారం తెచ్చుకుంటమని అడుగుతున్నాం. మా అమ్మ నాన్నల సమాధులు కూడా ఆ భూమిలోనే కట్టుకున్నం. ప్రభుత్వం ఏదైనా ఆదరువు చూపెట్టాలె.
-రాజు, కడంబ గ్రామస్థుడు
ఇదీ చదవండి: