తమ ఊరికి ప్రత్యేకంగా మత్స్య సహకార సంఘం ఏర్పాటు చేసి చెరువులో చేపలు పట్టుకునేందుకు హక్కు కల్పించాలని కుమురం భీం జిల్లా పెంచికలపేట మండలంలోని మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. రహదారిపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పెంచికలపేట మండలంలో స్థానికంగా ఉన్న మత్స్యకారులను కాదని ఇతర ప్రాంతాలవారికి చేపలు పట్టేందుకు అనుమతులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దరోగపల్లి చెరువులో ఇతరప్రాంతాల నుంచి వచ్చిన వారు దొంగతనంగా చేపలు పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో గతంలోనూ వివాదాలు నెలకొన్నాయని... అయినప్పటికీ అధికారులు స్పందించడంలేదన్నారు. మంచిర్యాల జిల్లా చిన్న గుడిపేట మత్స్య సహకార సంఘం నుంచి తమను వేరు చేసి చెడ్వాయిలో ప్రత్యేక మత్స్య సహకార సంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని హామీ ఇచ్చి ధర్నా విరమింపజేశారు.