ఉత్తర తెలంగాణలోనే ఒకప్పటి పీపుల్స్‌వార్ కార్యకలాపాల ప్రయోగశాలగా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్రలోనే మారుమూల ప్రాంతాల్లో డీజీపీ... రెండు రోజులపాటు బసచేయడం ఇదే ప్రథమం. జులై 15న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి అటవీప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న పోలీసులకు... మావోయిస్టులు తారసపడటం కాల్పులకు దారితీసింది. కానీ కీలక నేత మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ నేతృత్వంలోని మావోయిస్టులు తప్పించుకోవడం పోలీసులను నైరాశ్యానికి లోను చేసింది. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే జులై 17న ఆసిఫాబాద్‌కు చేరుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి అక్కడే బసచేసి ... రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించి, పోలీసులకు నగదు ప్రోత్సహకాలు అందించి భుజం తట్టారు.
ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు అటవీప్రాంతాలతోపాటు ప్రాణహిత, గోదావరి నదీపరివాహాక ప్రాంతాల్లో పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు మావోయిస్టులు యత్నిస్తున్నట్టుగా పోలీసు యంత్రాంగం భావిస్తోంది. ఇప్పటికే ఇక్కడి అటవీప్రాంతాన్ని పోలీసు బలగాలు జల్లెడపడుతుండటం... మారుమూల ప్రాంతాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనే దానిపై భయాందోళనలకు దారి తీస్తోంది. తాజాగా డీజీపీ మహేందర్‌రెడ్డి బుధవారం ప్రత్యేక హెలిక్యాఫ్టర్లో ఆసిఫాబాద్ చేరుకొని అక్కడి నుంచి రామగుండం సీపీ సత్యానారాయణతో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవీప్రాంతాన్నంతా ఏరియల్ సర్వే చేస్తూ... ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూర్‌కు చేరుకున్నారు. తిరిగి అక్కడి నుంచి ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్‌తో కలిసి మళ్లీ ఏరియల్ సర్వే చేస్తూ తిరిగి ఆసిఫాబాద్‌కు చేరుకోవడం చర్చనీయాంశమైంది.
బుధవారం రాత్రి ఆసిఫాబాద్‌లోనే బసచేసిన డీజీపీ... గురువారం కూడా మావోయిస్టు కార్యకలాపాలపై... పోలీసులతో అంతర్గత సమీక్ష నిర్వహించనున్నారు. మైలారపు అడెల్లు నేతృత్వంలోని కీలక మావోయిస్టుల బృందం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే సంచరిస్తున్నట్లు భావిస్తున్న పోలీసు యంత్రాంగం... దానికి అనుగుణంగా అధికారులకు బాధ్యతలను అప్పగించే ప్రయత్నం చేస్తోంది. రామగుండం సీపీ సత్యనారాయణ, ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్, మంచిర్యాల డీసీపీలకు అంతర్గతంగా ప్రాంతాలవారీగా బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. డీజీపీ పర్యటనను ఆధ్యంతం బయటకు వెళ్లనీయకుండా పోలీసు యంత్రాంగం గోప్యంగానే ఉంచుతోంది. ఆసిఫాబాద్‌లో డీజీపీ ఎప్పటివరకు ఉంటారనే సమాచారం వెల్లడించడం లేదు.
ఇదీ చూడండి : ఆ యాప్ సాయంతో.. సులభంగా సరకు రవాణా