కుమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద ప్రాణహిత నదిలో నాటు పడవ ప్రమాదానికి గురైంది. పడవలోని అటవీ సిబ్బంది గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో ఆరుగురు ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు పడవ నడిపేవారు, ముగ్గురు అటవీ సిబ్బంది, ప్రయాణికుడు ఉన్నారు. వీరిలో నలుగురికి ఈత రావడం వల్ల సురక్షితంగా బయటపడ్డారు. అటవీ సిబ్బంది బాలకృష్ణ, సురేశ్‌ల ఆచూకీ లభించలేదు. అటవీ సిబ్బంది తీర ప్రాంత గస్తీ నిర్వహిస్తుండగా పడవ ప్రమాదం చోటుచేసుకుంది.
గల్లంతయిన వారు ఇటీవలే అటవీ బీట్ అధికారులుగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ఇద్దరు అటవీ సిబ్బంది ప్రాణహిత నదిలో గల్లంతు కావడం వల్ల కాగజ్‌నగర్ డీఎస్పీ బీఎల్ఎన్ స్వామి, కాగజ్‌నగర్ డివిజన్ అటవీ శాఖ అధికారి విజయ్ కుమార్ ఘటనాస్థలిని సందర్శించి గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పడవ ప్రమాదానికి గురైన ప్రదేశం మహారాష్ట్ర పరిధిలోకి రావడం వల్ల మహారాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనాస్థలి వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి.
ఈ కథనం చూడండి: నిర్లక్ష్యపు డ్రైవింగ్.. తీసింది సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రాణం..