కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. కాగజ్ పట్టణంలో ఎస్పీఎం ఉద్యోగి ప్రసాద్ నివాసమైన క్వార్టర్ సీ59లో పొగలు వచ్చాయి. గమనించిన స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు తలుపులు తెరిచి చూడటంతో ఇంట్లో మంటలు చెలరేగుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. యజమాని ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి రెండు రోజుల క్రితం శుభకార్యానికి ఊరెళ్లారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లో సామగ్రి అగ్నికి ఆహుతైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి : వరద నీట మునిగిన ట్రాన్స్ఫార్మర్లు .. విద్యుత్ సరఫరా బంద్