Sharmila Comments: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది యువకులు బలిదానాలు చేసుకుంటే.. ఆవిర్భావం తర్వాత మాత్రం కేవలం కేసీఆర్ కుటుంబమే భోగాలు అనుభవిస్తోందని వైతెపా అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర ఖమ్మం మీదుగా సాగింది. పాదయాత్రలో భాగంగా నగరంలో ప్రధాన మార్గంలో ప్రజలకు అభివాదం చేశారు. పాత బస్టాండ్ దగ్గర నిర్వహించిన సభలో షర్మిల పాల్గొన్నారు. ఈ క్రమంలో షర్మిల.. ఖాకీ చొక్కా వేసుకుని ఆటో నడుపుతూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. పెద్దఎత్తున తరలివచ్చిన కార్యర్తలు, అభిమానులు.. షర్మిల ఆటో నడపటం చూసి ఈలలు వేస్తూ.. గోల చేశారు.
"రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మోసం చేయని వర్గంలేదు. 16 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్‌తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని అప్పుల మయం చేసిన ఘనత కేసీఆర్‌దే. ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన 16 మంది ముఖ్యమంత్రుల కన్నా.. ఒక్క కేసీఆర్ చేసిన అప్పులే ఎక్కువ. తెరాస బ్యాంకు ఖాతాలో రూ.860 కోట్లు ఉన్నాయి. వడ్డీ రూపంలో ఇప్పటికే రూ.25 కోట్లు వచ్చిందని ఆ పార్టీ చెబుతుంది. మరి పార్టీ దగ్గరే ఇన్ని వందల కోట్లు ఉంటే.. పార్టీ అధ్యక్షుడి దగ్గర, ఆయన కుటుంబ సభ్యుల దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ రౌడీ రాజ్యం నడుపుతున్నారు. మంత్రి పువ్వాడకు నిలకడ లేదు.. నిజాయతీ లేదు. ఖమ్మంలో 100 రూపాయల నుంచి 100 కోట్ల కాంట్రాక్టు పనులన్నీ మంత్రే చేస్తున్నారు. పోలీసులను అడ్డంపెట్టుకుని వైతెపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు." - వైఎస్ షర్మిల, వైతెపా అధ్యక్షురాలు