YS Sharmila Padayatra: వ్యవసాయరంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని.. రైతులకు అవసరమైన రాయితీలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 85వ రోజు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం ఏన్కూరు మండలంలో కొనసాగింది. టీఎల్పేట, లచ్చగూడెం, శ్రీరామగిరి గ్రామాల మీదుగా సాగిన పాదయాత్రలో.. ప్రజా సమస్యలను షర్మిల అడిగి తెలుసుకున్నారు. ఆరుకాయలుపాడు ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన రైతు గోస చర్చావేదికలో పాల్గొన్న షర్మిల.. రైతులకు గిట్టుబాటు కల్పించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. సభలో పలువురు మహిళలు తమకు ఆసరా పింఛన్లు రాక.. ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నామని కన్నీటిపర్యంతమయ్యారు.
"రైతుబంధు పేరుతో ఎకరానికి రూ. 5,000 ఇస్తున్న ప్రభుత్వం.. గతంలో ఉన్న రూ. 25 వేల రాయితీలను తొలగించింది. విత్తనాలు, ఎరువులపై ఎలాంటి సబ్సిడీ లేకపోవడం వల్ల అన్నదాతలపై మరింత భారం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రైతులు వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితి వచ్చింది. ఇటీవల యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. పంట సాగు చేయకుండా చేశారు." -వైఎస్ షర్మిల, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు
ఇవీ చూడండి: