ఖమ్మంలో ఆకతాయిలు మరోసారి రెచ్చిపోయారు. అర్ధరాత్రి పుట్టినరోజు వేడుకలు రోడ్డుపై నిర్వహించుకుంటూ మద్యం మత్తులో వాహనదారులపై దాడి చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత బైపాస్ రోడ్డుపై కొంతమంది యువకులు వీరంగం సృష్టించారు. అర్ధరాత్రి రెండు గంటలకు వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న డీసీఎం వాహనాన్ని ఆపి డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. అతని వద్ద ఉన్న డబ్బులు గుంజుకుని రోడ్డు పక్కన మురికి కాలువలో పడేశారు.
ఇంతలో అటుగా వెళ్తున్న వాహనదారులు ఆకతాయిలను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్లో ఇద్దరిని పట్టుకున్నారు. మిగతా వారు పారిపోయారు. గాయపడిన డ్రైవర్‌కు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కేవలం మద్యం మత్తులో తిరిగి తాగేందుకు డబ్బుల కోసం తనను చంపేందుకు కూడా యత్నించారని డ్రైవర్ వాపోయారు. పుట్టిన రోజు వేడుకల పేరుతో రోడ్డుపై వీరంగం సృష్టించే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని టూ టౌన్ సీఐ గోపి తెలిపారు.
ఇవీ చూడండి: మొక్కజొన్న పంటలపై వానరాల దాడి.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు