Wyra MLA Fires on Minister Puvvada : వచ్చే ఎన్నికల్లో గెలిచి.. మూడోసారి సీఎం అవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో గత నెలలో 115 స్థానాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. దీంతో సీటు రాని కొంతమంది నాయకులు తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ(Telangana Assembly Election) స్థానాల్లో వైరా మినహా మిగిలిన అన్ని సీట్లలో బీఆర్ఎస్ సిట్టింగులకు అవకాశం కల్పించింది.
MLA Ramulu Naik On Puvvada Ajay : వైరాలో మాత్రం సిట్టింగు ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్(Ramulu Naik) స్థానంలో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్(Madhan Lal)ను అభ్యర్థిగా ప్రకటించింది. నియోజకవర్గంలో పరిస్థితులు, పార్టీ అంతర్గత సర్వేల ఆధారంగా అభ్యర్థిని మార్చామంటూ బీఆర్ఎస్(BRS) అధిష్ఠానం చెప్పుకొచ్చింది. అయినప్పటికీ పార్టీ పెద్దలను కలిసి టికెట్ తనకే కేటాయించాలని రాములు నాయక్ విశ్వప్రయత్నాలు చేసినా ఫలించలేదు. రాజకీయంగా అవకాశం కల్పిస్తామంటూ అధిష్ఠానం బుజ్జగించటంతో ఎమ్మెల్యే తన పంతం వీడారు. దళిత బంధు రెండో విడత వైరా లబ్ధిదారుల ఎంపిక బీఆర్ఎస్లో చిచ్చు రేపింది. నియోజకవర్గంలో 1,100 మంది లబ్ధిదారుల ఎంపికలో 500 మంది ఎంపిక బాధ్యతలను అధిష్ఠానం మదన్ లాల్‌కు అప్పగించడంతో ఎమ్మెల్యే రాములు భగ్గుమన్నారు.
Edupayala Temple Controversy : మెదక్ బీఆర్ఎస్లో విబేధాలు.. అమ్మవారి సమక్షంలో తడిబట్టలతో ప్రమాణాలు
"టికెట్ రాకున్నా పార్టీ గెలుపునకు కృషి చేస్తాను. అభ్యర్థికి స్వాగతం పలికాను. బావా అంటూ వచ్చి కుచ్చుటోపీ పెడుతున్నారు. తనకు టికెట్ రాకుండా చేసిన పెద్ద మనిషే ఇదంతా చేస్తున్నారు. పైన రాజు, యువరాజు తనకు అన్యాయం చేశారు. ఇప్పుడు ఇక్కడున్న సామంతరాజు తనపై కక్ష సాధిస్తున్నారు." - రాములు నాయక్, వైరా ఎమ్మెల్యే
MLA Ramulu Naik Fires on Puvvada Ajay : వైరాలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మదన్ లాల్‌తోపాటు ఏకంగా జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై ఎమ్మెల్యే రాములు నాయక్ తీవ్ర ఆరోపణలు చేయడం రాజకీయంగా వేడి రాజేస్తోంది. ప్రధానంగా గురువారం నాడు మంత్రి పువ్వాడతో కలిసి మదన్ లాల్, కేటీఆర్‌ను కలిశారు.
Wyra Politics 2023 : అదే రోజు దళితబంధులో సగం లబ్ధిదారుల ఎంపిక చేసే బాధ్యత మదన్ లాల్‌కు అప్పగించడంతో ఎమ్మెల్యే రగిలిపోయారు. ముఖ్య కార్యకర్తల సమావేశంలో బహిరంగంగానే మంత్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజ్యాంగం తనకు కల్పించిన హక్కును మూడు నెలల ముందే కాలరాస్తానంటే ఊరుకోబోనని మదన్ లాల్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఎమ్మెల్యే రాములు నాయక్, బీఆర్ఎస్ అభ్యర్థి మదన్ లాల్ మధ్య సయోధ్య కుదర్చాల్సి వస్తే మంత్రి పువ్వాడ రంగంలోకి దిగాల్సి ఉంటుంది. అయితే ఎమ్మెల్యే ఏకంగా మంత్రినే లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజా రాజకీయ పరిణామాలు వైరాలో ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
BRS On Jamili Election 2023 : జమిలి ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధం.. నేతలకు కేసీఆర్ మార్గనిర్దేశం