ఖమ్మం జిల్లా పెనుబల్లిలో ఓ యువతి ఆరునెలల బాబుతో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసింది. సమయానికి పోలీసులు వచ్చి యువతిని, బాబును ఆసుపత్రికి తరలించారు.
అసలేం జరిగిందంటే...
పెనుబల్లి గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన నాగరాజు నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ప్రియుడిని నమ్మిన ప్రియురాలు అతనితో సహజీవనం చేయడం వల్ల బాబు పుట్టాడు. ఆ తర్వాత ఆ బాబు తనకు పుట్టలేదని నాగరాజు మొహం చాటేశాడు. దీనితో బాధితురాలు వీఎం బంజర్ పీఎస్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేశారు. పలుమార్లు పోలీసులు, పెద్దలు సమక్షంలో పంచాయతీ జరిగిన నాగరాజు ఆ యువతిని వివాహం చేసుకునేందుకు నిరాకరించాడు.
దీనితో మనస్తాపం చెందిన ఆ యువతి పెనుబల్లిలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నాగరాజు తనను పెళ్లి చేసుకోవాలని లేకపోతే దూకేస్తానని బెదిరించింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సత్తుపల్లి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారి సహాయంతో ఆ యువతిని వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం యువతి, బాబు క్షేమంగా ఉన్నారు.
నాగరాజుతో తనకు పెళ్లి చేయాలని... అవసరమైతే డీఎన్ఏ పరీక్షలు జరిపి తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంది. పోలీసులు తనకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: కరోనాను అడ్డుపెట్టుకొని 9వేల సైబర్ దాడులు