హైదరాబాద్‌కు చెందిన స్వాతికి.. ఖమ్మం నగరం పాండురంగాపురానికి చెందిన బాలాజీ నాయక్‌తో 2017లో ఆర్యసమాజ్‌లో వివాహం జరిగింది. మొదట్లో కాంట్రాక్ట్ బేసిక్‌లో పనిచేసే బాలాజీ ఉద్యోగం.. పెళ్లి తర్వాత రెగ్యులర్ అయింది. కొన్నిరోజుల తర్వాత అదనపు కట్నం కోసం స్వాతిని వేధించడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులు తట్టుకోలేక స్వాతి.. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
ఉద్యోగం పేరిట బాలాజీ వేరే చోట ఉండగా.. బాబుతో స్వాతి అత్తవారింట్లో ఉండేది. తన వద్దకు వస్తానని బాలాజీని అడగగా ఆమెను కొట్టి పుట్టింటికి పంపాడు. భర్త చర్యలతో విసిగిపోయిన స్వాతి.. మరోసారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మరోసారి కౌన్సిలింగ్ ఇవ్వగా.. తనతో ఉండటం ఇష్టం లేదని, కావాలంటే కేసు పెట్టుకోమని తేల్చేశాడని బాధితురాలు కన్నీటిపర్యంతమయింది. అటు అత్తింటి వారు రానివ్వడం లేదు.. కట్టుకున్న భర్త పట్టించుకోవడం లేదని మూడ్రోజులుగా పార్కుల్లో, బస్టాండుల్లో చంటి పిల్లాడితో తలదాచుకుంటోంది. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. విషయం తెలుసుకున్న ఖమ్మం ప్రగతి శీల మహిళా సంఘం నేతలు వారిని చేరదీసి తమ కార్యాలయంలో ఆశ్రయం కల్పించారు.