Khammam BRS Public Meeting : తెలంగాణ సాధనే ప్రధాన అజెండాగా ఆవిర్భవించిన టీఆర్ఎస్.. భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న తొలి సభ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాజకీయ వైఖరిని వ్యతిరేకిస్తున్న కేసీఆర్ ప్రత్యామ్నాయ రాజకీయ అజెండాపై బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ వచ్చిన ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. దిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌సింగ్‌మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా.. రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి ఇవాళ ఉదయం ప్రగతిభవన్‌లో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేతలు జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, రాష్ట్రాల ఇబ్బందులు, తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ ఆవిర్భావ సభ.. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాజకీయ వైఖరికి వ్యతిరేకంగా జరుగుతున్నప్పటికీ.. కాంగ్రెస్, ఆ పార్టీతో కలిసి పోటీ చేసిన ముఖ్యమంత్రులెవరినీ ఆహ్వానించలేదు. కాంగ్రెస్‌కు కూడా దూరంగా ఉన్న ఆమ్ ఆద్మీ, సమాజ్‌వాదీ పార్టీ నేతలతో పాటు రాష్ట్రంలో వామపక్షాలతో కలిసి వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించుకొన్న నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా ఈ సభలో పాల్గొంటున్నారు. దీంతో ఇది బీజేపీయేతర-కాంగ్రెసేతర సభగా మారింది.
అందుకు ఈ సభ కీలకం..: 2024 ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యామ్నాయం ప్రస్తుతం సభలో పాలుపంచుకొంటున్న పార్టీలతోనే వీలుకాదని.. మిగిలిన పార్టీలు కూడా ఇందులో భాగస్వాములు కావలసి ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సభ అనంతరం జరిగే పరిణామాలు ఆసక్తికర మలుపు తీసుకొనే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాదిలో, లోక్‌సభకు వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ భారీ బహిరంగ సభ చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో జరిగే రాజకీయ పరిణామాల్లో ఈ సభ కీలకం కానుందనే అభిప్రాయాన్ని రాజకీయవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
అందుకే ఖమ్మంలో సభ..!: బీఆర్ఎస్ ఆవిర్భావ సభను హైదరాబాద్, దిల్లీ లాంటి కీలకమైన ప్రాంతాలలో కాకుండా ఖమ్మంలో నిర్వహించనుండటం కూడా ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లకు ఖమ్మం సరిహద్దు కావడం ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల్లో వామపక్షాలతో కలిసి వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించుకోవడం, ఖమ్మం జిల్లాలో ఆ పార్టీలకు కొంత పట్టు ఉండటంతో ఇక్కడ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ జిల్లాలో బీఆర్ఎస్కు చెందిన కొందరు నాయకులు పార్టీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సభ మరింత ఆసక్తికరంగా మారింది.
ఇవీ చూడండి..
ఖమ్మం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ పూర్తి షెడ్యూల్ ఇదే!
BRS సభకు తరలివస్తోన్న జాతీయనేతలు.. హైదరాబాద్‌కు దిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు, డీ రాజా