మార్కెట్ యార్డుల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా కందులు చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరాలోని కందుల కొనుగోలు కేంద్రాన్ని మార్క్ఫెడ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. యార్డులో ఆరబోసిన కందుల రాశులను తనిఖీ చేసి.. రైతులతో మాట్లాడారు. కేంద్రం ప్రారంభించి రెండు వారాలు గడిచినా.. ఇప్పటికీ కొనుగోళ్లు ప్రారంభించలేదని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
తాము పంట సాగు చేసినప్పటికీ ఆన్‌లైన్‌లో తమ పేరు నమోదు కాలేదని చెబుతున్నారని.. ఫలితంగా యార్డులో పడిగాపులు కాయాల్సివస్తోందని వాపోయారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని.. ప్రతి రైతు దిగుబడులనూ కొనుగోలు చేస్తామని జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఝాన్సీ లక్ష్మీకుమారి రైతులకు భరోసా ఇచ్చారు.
ఆన్‌లైన్‌లో పేర్ల నమోదుపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. తేమ లేకుండా కందులను ఆరబోసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ గుమ్మా రోశయ్య, మార్క్ఫెడ్ డీఎం సుధాకర్, ఏడీఏ బాబురావు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: విద్వేషపూరిత సందేశాలను అరికట్టేందుకు వాట్సప్ నంబర్!