VANAJEEVI RAMAIAH: అసలే ఏడు పదులు దాటిన వయసు.. అంతంతమాత్రంగానే సహకరించే ఆరోగ్యం.. వీటికి తోడు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై గాయాలపాలై కదల్లేని స్థితిలోకి వెళ్లారు.. వనజీవి రామయ్య. వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవలే ఇంటికి చేరారు. కదల్లేని స్థితిలో ఉన్నా... గాయాలు నొప్పి పెడుతున్నా.. ఏమాత్రం లెక్కచేయకుండా తన ఆశయ సాధనకు ముందుకు సాగుతున్నారు. ఖమ్మం గ్రామీణం మండలం పల్లెగూడెం గ్రామానికి చెందిన దరిపల్లి రామయ్య.. వనజీవి రామయ్యగా సుపరిచితులు. కదల్లేని స్థితిలో ఉన్న ఆయన... ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ప్రత్యేక వాహనం తెప్పించుకుని విత్తనాలు చల్లే మహాయజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు.
వారం రోజులు విరామం.. మళ్లీ మహాయజ్ఞం..: వనజీవి రామయ్య ఇటీవల ఉదయాన్నే రోడ్డుపక్కన నాటిన మొక్కలకు నీళ్లు పోసేందుకు వెళ్తుండగా వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో గాయాలయ్యాయి. కాలికి పలుచోట్ల కుట్లుపడ్డాయి. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో వారం రోజులు చికిత్స పొందారు. నాలుగు రోజుల క్రితమే ఇంటికి చేరారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నుంచి మళ్లీ మొక్కల పెంపకాన్ని భుజస్కందాలపై ఎత్తుకున్నారు. ప్రమాద సమయంలో కేవలం వారం రోజులు మాత్రమే మొక్కల పెంపకానికి విరామం ఇచ్చి... మళ్లీ ఆ యజ్ఞాన్ని ప్రారంభించారు. సతీమణి జానమ్మను వెంటబెట్టుకుని ఓ వాహనంలో బయలుదేరి రెడ్డిపల్లి-ముత్తగూడెం రహదారికి ఇరువైపులా విత్తనాలు చల్లారు.
అదే ధ్యేయం..: పర్యావరణాన్ని కాపాడటమే జీవితాశయమని.. వీలైనన్ని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నదే ధేయ్యమని వనజీవి రామయ్య చెబుతున్నారు. ఆరోగ్యం సహకరించకున్నా మొక్కల పెంపకంపై అమితమైన ప్రేమను చూపుతున్న వనజీవి రామయ్యపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఇవీ చూడండి..