ఖమ్మంలో ఇటీవల ఆత్మహత్మ చేసుకున్న భాజపా కార్యకర్త సాయి గణేశ్ కుటుంబంతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్‌లో మాట్లాడారు. సాయిగణేశ్ మృతి పట్ల అమిత్‌షా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి.. కుటుంబసభ్యులను పరామర్శించారు. సాయిగణేశ్ అమ్మమ్మ సావిత్రి, సోదరితో మాట్లాడి.. సంతాపం తెలిపారు. తమకు న్యాయం చేయాలని అమిత్‌షాను కుటుంబీకులు కోరగా.. పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అక్రమ కేసులతో పోలీసులు తనను వేధిస్తున్నారంటూ సాయిగణేశ్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
సాయిగణేశ్ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్సీ, భాజపా తమిళనాడు ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి పరామర్శించారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్‌రెడ్డితో కలిసి సాయి నివాసానికి వెళ్లారు. మంత్రి ప్రోద్భలం, పోలీసుల అత్యుత్సాహం వల్లే నిబద్ధత కలిగిన కార్యకర్తను కోల్పోయమని సుధాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే.. చనిపోయిన వాళ్లపైన కూడా కేసులు పెట్టడమేనా..? అని సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సాయి కుటుంబానికి లక్షరూపాయలు ఆర్థిక సాయం చేశారు.
అసలు ఏం జరిగిందంటే..: ఖమ్మం భాజపాలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సాయిగణేశ్ అనే కార్యకర్త.... ఈ నెల 14న పోలీస్‌స్టేషన్ ఆవరణలో పురుగులమందు తాగాడు. తొలుత అతణ్ని ఖమ్మం ఆస్పత్రికి తరలించగా... మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. రెండ్రోజుల పాటు చికిత్స పొందినా.. సాయిగణేశ్ పరిస్థితి మెరుగవ్వకపోగా ఇంకా విషమించింది. చికిత్స పొందుతూనే సాయిగణేశ్ ప్రాణాలు విడిచాడు.
వచ్చే నెల 4న పెళ్లి జరగాల్సి ఉండగా..: సాయిగణేష్ మృతితో భాజపా శ్రేణులు ఖమ్మంలో ఆందోళనకు దిగారు. తెరాసకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాయిగణేశ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. సాయిగణేష్‌ను పోలీసులు, అధికార పార్టీ నేతలు తీవ్రంగా వేధించారని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆరోపించారు. సాయిగణేశ్‌కు.. వచ్చే నెల 4న వివాహం జరగాల్సి ఉండగా... ఇంతలోనే ఈ ఘోరం జరిపిపోయిందంటూ... కన్నీటి పర్యంతమ్యయారు. అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని భాజపా నేతలు ఆరోపించారు.
సంబంధిత కథనం..