మహబూబాబాద్ జిల్లా బంగ్లాకు చెందిన జంపాల వెంకన్న... బతుకుదెరువు కోసం 20 ఏళ్ల క్రితం ఖమ్మం నగరానికి వలస వచ్చి... మమత ఆస్పత్రి రోడ్డులోని కాల్వకట్టపై గుడిసె వేసుకుని తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. స్థానిక ముస్తాఫనగర్‌లో క్షౌర వృత్తి చేసుకుని జీవనం సాగించేవాడు. 9 సంవత్సరాల క్రితం... పని ముగించుకుని సైకిల్‌పై వస్తున్న వెంకన్నను... గుర్తు తెలియని బైక్ ఢీకొట్టింది. అప్పటినుంచి వెంకన్న తన వినికిడి శక్తిని కోల్పోయాడు.
చెక్కు మంజూరైంది...
ఖమ్మం ఆస్పత్రిలో చూపించుకుంటే శస్త్ర చికిత్స చేయించుకుంటే వినికిడి వస్తుందని తెలపి... హైదరాబాద్‌కు సిఫార్సు చేశారు. కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రిలో చూపించగా... వారు రూ.6లక్షలు అవుతాయన్నారు. ఇది ఆరోగ్యశ్రీలోకి రాదని చెప్పటంతో వారు ఖమ్మం తిరిగి వచ్చారు. అనంతరం మంత్రి అజయ్‌కుమార్‌ను(అప్పుడు ఎమ్మెల్యే) కలిశారు. స్పందించిన అజయ్‌కుమార్ అతని సమస్యను కేటీర్ దృష్టీకి తీసుకువెళ్లారు. శస్త్ర చికిత్స కోసం రూ.6 లక్షల చెక్కును మంజూరు చేశారు. శస్త్ర చికిత్స చేయించుకుని పూర్వపు జీవితం గడపమని శుభాకాంక్షలు తెలిపారు.
కానీ డబ్బే ఖాతలో జమ కాలేదు...
ఎంతో సంతోషంతో బాధితుడు హైదరాబాద్ ఈఎన్‌టీ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ చెక్కు..సిఫార్సు లేటర్‌ను ఇచ్చారు. పదిరోజులు ఆస్పత్రిలో ఉంచుకుని పరీక్షలు చేశారు. చివరకు నీ బ్యాంకు ఖాతాలో చెక్కుకు సంబంధించిన డబ్బులు పడలేదని తెలిపారు. డబ్బుల పడినప్పుడు కబురు చేస్తామని తిరిగి ఇంటికి పంపారు. రెండేళ్లుగా వెంకన్న కుటుంబం ఆస్పత్రికి వెళ్లి వస్తున్నా... ఇంకా నీ డబ్బులు పడలేదనే సమాధానమే వస్తోంది.
భయంగా ఉంటుంది...
రెండు చెవులు వినిపించక పోవటంతో బయటకు వెళ్లలేకపోతున్నానని.. పని వద్ద ఇబ్బందిగా ఉందని బాధితుడు వాపోతున్నాడు. తండ్రి బయటకు వెళ్లి ఇంటికి వచ్చే వరకు తమకు భయంగా ఉంటుందని... పెద్ద వాహనాల శబ్ధాలు వినిపించక ప్రమాదం జరుగుతుందేమోనని ఆందోళనగా ఉంటుందని కుమార్తె కన్నీటీ పర్యంతమైంది.
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం చేసినా... ఇంత వరకు నగదు జమకాక పోవటంతో ఓ బాధితుడు తన సాధారణ జీవితాన్ని కోల్పోతున్నాడు. ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైన అతనికి సాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: భాగ్యనగరంలో పేదల బతుకుల్ని చిదిమేసిన వర్షం