దిల్లీలో రైతుల దీక్షలకు మద్దతుగా రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు ఖమ్మంలో పెద్దసంఖ్యలో మానవహారం నిర్వహించారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసేలా ఉన్న కొత్త చట్టాలను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. సాగు చట్టాలను రద్దు చేయకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. పేదలపై సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్రనేత పోటు రంగారావు ఆరోపించారు. రైతు చట్టాల పేరుతో రైతును కూలిగా మార్చేందుకు భాజపా కుట్ర చేస్తోందని సీసీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అన్నారు. పట్టణంలోని వైరా రోడ్డు మయూరి కూడలి నుంచి ఇల్లందు కూడలి వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ రోడ్డు పక్కన నిల్చున్నారు. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నాం. చట్టాలను వెనక్కి తీసుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేపడుతాం. యాసంగి నుంచి కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తామన్న రాష్ట్రవ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూర్చే కేంద్ర వ్యసాయ చట్టాలను రద్దు చేయాలి. దేశంలో అన్ని వర్గాలు కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్నాయి. మద్దతు ధర ఇస్తామని, స్వామినాథన్ కమిషన్ చెప్పినట్లు ధరలు అమలు చేస్తామని అబద్ధాలు చెబుతున్నారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. వీటి వల్ల మార్కెట్ కమిటీలు రద్దు చేసేలా కేంద్రం వ్యవహరిస్తోంది.
-తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి