Concern of cotton farmers: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పత్తి రైతులు దగా పడుతున్నారు. పంట అమ్ముదామని మార్కెట్‌కు తీసుకొస్తే రోజురోజుకు ధర తగ్గిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పత్తి రాక మొదలైన తొలి రోజుల్లో క్వింటాల్ ధర సుమారు 8వేలు పలికింది. ధరలు ఆశాజనకంగా ఉన్నాయన్న ధీమాతో పత్తిని తీసుకొస్తే ధరలు విపరీతంగా తగ్గిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.
ఖమ్మం వ్యవసాయం మార్కెట్‌లో పత్తి గరిష్ఠ ధర క్వింటాల్‌కు 8వేలు, కనిష్ఠ ధర 4వేలు మాత్రమే ఉంది. ఈ ఏడాది ప్రభుత్వం కనీస మద్దతు ధర క్వింటాల్‌కు 6వేల 380 ప్రకటించింది. కాని మార్కెట్‌లో పరిస్థితి గమనిస్తే 90 శాతం మందికి కనీస మద్దతు ధర లభించడం లేదు. నాణ్యత లోపం అనే సాకులు చెబుతూ వ్యాపారులు దారుణంగా ధరలు తగ్గించేస్తున్నారని, పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని పత్తి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీపావళికి పత్తి బస్తాలతో కళకళలాడిల్సిన వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు ఇప్పుడు నాలుగైదు వందల బస్తాలు కూడా రావడం లేదు. పంట వేసిన దగ్గర నుంచి పూత వచ్చే వరకు ఆగకుండా కురిసిన వర్షాలు రైతులను నష్టాల పాలుచేశాయి. ఆరు ఎకరాల్లో పత్తి వేస్తే ఆరు బస్తాలు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. పంట పెట్టుబడి ఎక్కువై దిగుబడి మాత్రం గణనీయంగా తగ్గిందని రైతులు వాపోతున్నారు.
ప్రస్తుతం ఈ మార్కెట్‌లో క్వింటాల్‌కు పత్తి ధర 7వేల 500 పలుకుతున్నా, తేమ శాతం కారణంగా ఐదు నుంచి ఆరు వేలు మాత్రమే వస్తున్నాయి. కొందరికైతే 4వేలు మాత్రమే దక్కుతున్నాయి. క్వింటా పత్తి ధర కనీసం పదివేలు ఉంటే తమకు గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు.ప్రస్తుతం మార్కెట్ ధరలు ఆశాజనకంగా లేవని అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తడి పత్తి తీసుకురావడంతో రైతులు నష్టపోతున్నారని, బాగా ఆరబెట్టిన తర్వాతే మార్కెట్‌కు తీసుకురావాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలో పత్తి రైతులకు సీసీఐ అండగా నిలిచి కనీస మద్దతు ధర కొనుగోలు చేయాల్సి ఉన్నా, ఇంత వరకు దాని నుంచి స్పందన లేదు. సీసీఐ తమ సమస్యలు పరిష్కరించాలని, గిట్టుబాటు ధరలు ప్రకటించి ఆదుకోవాలని పత్తి రైతన్నలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇవీ చదవండి: