woman Suspicious death in khammam: చికిత్స కోసం పట్టణానికి వచ్చిన ఒక మహిళను తీసుకుని ఒక ఆటో డ్రైవర్ పరారయ్యాడు. మరుసటి రోజు గాయాలతో ఉన్న ఆ మహిళను గుర్తు తెలియని వ్యక్తి ఖమ్మం సర్వజనాసుపత్రిలో వదిలేసి వెళ్లిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. బాధితురాలిపై అత్యాచారం జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఈనెల 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రామన్నకుంట తండాకు చెందిన ఒక మహిళ(45) తన అత్తతో కలిసి ఆస్పత్రికి వెళ్దామని ఈనెల 27న రైలులో ఖమ్మం చేరుకుంది. ఈ ఇద్దరు ఆస్పత్రికి వెళ్లడానికి ఓ ఆటో ఎక్కారు. మార్గం మధ్యలో మహిళ అత్త మూత్ర విసర్జనకు దిగింది. అంతలోనే ఆటో డ్రైవర్ ఆ వివాహితను తీసుకుని ఆటోలో పరారయ్యాడు. మహిళ అత్త వచ్చి చూడగా అక్కడ ఆటో కనిపించలేదు. కొద్దిసేపు వెతికిన ఆమె కోడలు ఆచూకీ కనిపించకపోయే సరికి ఇంటికి తిరిగి వెళ్లింది. కుటుంబ సభ్యులకు అసలు సంగతి చెప్పింది.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మరుసటి రోజు ఉదయం ఖమ్మం చేరుకున్నారు. బాధితురాలి కోసం అన్ని చోట్లా గాలించినా ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. అయితే మొదట.. ఖమ్మంలోని ఒకటో పట్టణం, రెండో పట్టణం, ఖానాపురం హవేలీ పోలీస్‌స్టేషన్లను ఆశ్రయించి కేసు నమోదు చేసుకోమని ఆశ్రయించగా పోలీసులు.. సొంత ప్రాంతంలో ఫిర్యాదు చేయాలని వారిని వెనక్కి పంపారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. తర్వాత చెన్నారావుపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా అక్కడా కూడా పోలీసులు కేసు నమోదు చేసుకోలేదని ఆరోపించారు.
అత్యాచారం జరిగిందా..? చివరకు ఖమ్మంలోని ఓ మాజీ కార్పొరేటర్‌కు జరిగిన విషయాన్ని తెలిపి ఆయన సాయంతో బాధిత కుటుంబ సభ్యులు ఖమ్మం 2వ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు మంగళవారం రోజున వెళ్లి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు.. ఖమ్మం జిల్లా సర్వజనాసుపత్రి మార్చురీలో భద్రపరిచిన ఆ మహిళ మృతదేహం ఫొటోలను బాధిత కుటుంబ సభ్యులకు చూపించారు. ఆ మృతదేహం వివాహితదేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. అనుమానాస్పదంగా మరణించడం వల్ల ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని వారు ఆరోపిస్తున్నారు.
'అపహరణకు గురైన వివాహిత మహిళను గుర్తు తెలియని యువకుడు ఏప్రిల్ 28వ తారీఖున ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఖమ్మం సర్వజనాసుపత్రి క్యాజువాలిటీకి తీసుకొచ్చాడు. వివాహిత ఛాతి, తల భాగాలపై బలమైన గాయాలు ఉండటంతో వైద్యులు తక్షణమే చికిత్సను ప్రారంభించారు. వివాహితను ఆస్పత్రిలో చేర్పించిన యువకుడు ఓపీ కోసం వెళ్లి కనుమరుగైపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు మధ్యాహ్నం 3.20 గంటల సమయంలో మృతి చెందింది. మహిళ మృత దేహాన్ని తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు ఎవ్వరూ రాకపోవడంతో వైద్యులు ఔట్‌పోస్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుర్తుతెలియని మృతదేహంగా నమోదు చేసుకుని మార్చురీలో మృతదేహాన్ని పెట్టారు. కుటుంబ సభ్యులను విచారించిన తర్వాత పోలీసులు ఆసుపత్రి, రైల్వేస్టేషన్, పోలీస్‌స్టేషన్లలో సీసీటీవి ఫుటేజీలను పరిశీలించారు. హత్య, అపహరణ కేసులు పెట్టి దర్యాప్తును ప్రారంభించారు. అత్యాచారం జరిగిందా? లేదా? అనే విషయం పోస్టుమార్టం అనంతరం తెలిసే అవకాశం ఉంది' - ఖమ్మం పోలీసులు
ఇవీ చదవండి: