chilli farmers problems: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మిరప సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వాణిజ్య పంట మిర్చిని సాగు చేసేందుకు ఎకరాకు లక్షకు తగ్గకుండా అన్నదాతలు పెట్టుబడులు పెట్టారు. ఉమ్మడి జిల్లాలో ఈసారి లక్షా 30 వేల ఎకరాల్లో మిర్చి సాగుచేశారు. గత సీజన్‌లో దిగుబడులు పెరగడం, ధర మెరుగ్గా రావడం చూసి ఈసారి అత్యధికంగా మిర్చి సాగువైపే మొగ్గుచూపారు. కాత పూత దశకు వరకు రైతుల్ని ఊరించిన మిరప పైర్లు ఆ తర్వాత తెగుళ్ల దెబ్బకు జీవం కోల్పొయాయి. కాయకుళ్లు తెగులు, జెమిని వైరస్, కింది ముడత, పైముడత, లద్దెపురుగు కొమ్మ కుళ్లు, కాయకుళ్లు, ఎండు తెగులు పంట ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రస్తుతం చేతికొచ్చే దశలో తామరపురుగు ఉద్ధృతి మిర్చి తోటలను పీల్చి పిప్పి చేస్తోంది.
'దాదాపు వారానికి మూడు సార్లు మందులు కొట్టాం. కూలీ వాళ్లకు డబ్బులివ్వాలి. ఎవరూ ఆదుకోవడానికి రావట్లేదు. ఎకారానికి లక్ష పెట్టుబడి పెట్టా... ఏమీ లేదు..మొత్తం పురుగు వచ్చింది. పంట చూస్తుంటే.. ఏడుపే వస్తోంది. ఇంకా నాకు ఏ పంట లేదు. ఈ ఒక్క పంటే వేశాను. నిండా మునిగిపోయా...
- మిర్చి రైతుల కన్నీటి వేదన
Chilli farmers stare at huge losses: మిర్చి తోటలను చూసి బోరుమంటున్న రైతులు వాటిని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 20రోజుల్లో పురుగుమందుల వినియోగం విపరీతంగా పెరిగింది. రైతుల అవసరాన్ని అవకాశంగా మలుచుకుంటున్న పురుగు మందుల దుకాణదారులు ఇష్టారాజ్యంగా విక్రయాలు సాగిస్తున్నారు. ఒక్కో రైతు అదనంగా ఎకరాకు సుమారు 8 వేల నుంచి 10 వేల వరకు పురుగు మందుల కోసం ఖర్చు చేశారు. మొత్తంగా పెస్టిసైడ్స్ కోసం 40 కోట్లు ధారపోశారు. పెట్టుబడి రావడం సైతం కష్టంగా ఉన్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని మిర్చి రైతులు వేడుకుంటున్నారు. నష్టం అంచనా వేసి పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.
'మూడు ఎకరాలు పంట వేశాం. ఇంతకు ముందు అప్పులు ఉన్నాయి. ఇప్పుడు అప్పులే మిగిలాయి. మొత్తం తామర పురుగులు వచ్చి.. పంట మొత్తం నాశనమైంది. ఎకరానికి రెండు మూడు క్వింటాళ్లు కూడా రావు. 20 రోజుల్లోనే వైరస్ ఎక్కువైంది. ఎకరానికి లక్ష రూపాయాల చొప్పున ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం.
- మిర్చి రైతుల ఆవేదన