వైద్యుల నిర్లక్ష్యం వల్ల తమ శిశువు చనిపోయాడని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేసిన సంఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. ఖమ్మం మాతా శిశు ఆరోగ్య కేంద్రం వద్ద శిశువు బంధువులు బైఠాయించి నిరసన చేపట్టారు. ఈనెల 11న తిరుమలాయపాలెం మండలం బచ్చోడ తండాకు చెందిన గర్భిణి ప్రభుత్వ ఎంసీహెచ్‌లో కాన్పు కోసం చేరింది. సుమారు 36 గంటల పాటు సాధారణ కాన్పు కోసం ప్రయత్నించారు. శిశువు జననం సరిగా జరగక పోవటం వల్ల ఆరోగ్య పరిస్థితి విషమించటంతో ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ శిశువు అక్కడ మృతి చెందాడు. బంధువులు మృత దేహంతో ఖమ్మం ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. వైద్యులు సాధారణ కాన్పు కోసం వేచి ఉండటం వల్ల శిశువు పరిస్థితి విషమంగా మారి చనిపోయాడని బంధువులు ఆరోపించారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింప చేశారు.
ఇవీ చూడండి: రోడ్డు దాటుతూ చనిపోయాడు...