ఖమ్మం జిల్లాలో రహదారుల పరిస్థితి అధ్వానంగా మారింది. అడుగడుగూ గతుకులతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లపై గుంతల్లో ప్రయాణం నరకప్రాయంగా మారిందని వాహనదారులు వాపోయారు. ఓవైపు ప్రమాదాలు... మరోవైపు గుంతల్లో ప్రయాణాలతో వాహనాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనాల పరిస్థితి దారుణంగా మారింది. ఖమ్మం జిల్లాలో రహదారులు సరిగా లేక ఇటీవలే వందలాది మంది ప్రమాదాల బారిన పడ్డారు.
రద్దీ రోడ్లు... అధ్వానం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూసుమంచి నుంచి అశ్వారావుపేట వరకు జాతీయ రహదారి వేలాది వాహనాలతో నిత్యం రద్దీగా ఉంటుంది. రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, ఒడిశా, మధ్యప్రదేశ్‌కు అధిక లోడుతో లారీలు తిరుగుతుంటాయి. అశ్వారావుపేట నుంచి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్లే రహదారిని పూర్తిగా మూసేయగా చింతలపుడి, విస్సన్నపేట మీదగా వెళ్తున్నారు. ఆ రహదారులు మరింత అధ్వానంగా ఉన్నాయి.
ఎన్నో ప్రమాదాలు...
జిల్లాలో కొన్నిచోట్ల రహదారులు ప్రయాణం చేసేందుకు వీలుగా లేవు. తల్లాడ మండలం రెడ్డిగూడెం వద్ద గుంతలతో నెలరోజుల్లో 20 వాహనాలు బోల్తాపడ్డాయి. ఎక్కువగా ట్యాంకర్లు, అధిక లోడుతో వెళ్తున్న లారీలే కిందపడ్డాయి. ఎన్ని ప్రమాదాలు జరిగినా మరమ్మతులు చేయలేదు. తల్లాడ- కల్లూరు మధ్యలో 10 కిలోమీటర్లు, వైరా- తల్లాడ మధ్య 8 కిలోమీటర్ల మేర రోడ్లు అధ్వానంగా మారాయి. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ రోడ్లు మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించినా పెద్దగా ఫలితం లేదు.
ప్రాణప్రాయంగా రహదారులు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అంతర్రాష్ట్రాలు, జిల్లాలను కలిపే రహదారులే ఎక్కువగా ఉన్నాయి. ఆ దారులన్నీ ప్రాణాపాయంగానే ఉన్నాయి. కొత్తగూడెం నుంచి నిత్యం బొగ్గులోడుతో, పాల్వంచ నుంచి యాష్‌తో కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు వెళ్లే వాహనాలతో రహదారులు రద్దీగా ఉంటాయి. తల్లాడ నుంచి వైరా, వైరా నుంచి బోనకల్, మధిర వరకు రోడ్లు నరకప్రాయంగా మారాయి. ఇటీవల వర్షాలకు చాలా చోట్ల గుంతలతో పాటు కోతలకు గురయ్యాయి. రెబ్బవరం వద్ద రహదారి పూర్తిగా కుంగి నెలరోజులు గడుస్తోంది. కల్లూరు, వీఎం బంజర, తిరువూరు రహదారి, ఇల్లెందు, భద్రాచలం, బోనకల్, తిరుమలాయపాలెం రహదారుల్లోనూ గుంతల రోడ్లు ఎక్కువగా ఉన్నాయి.
చర్యలు అవసరం
వైరా సమీపంలో ఏటి వంతెనపై గుంతలు ఏర్పడి చాలా ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు వాపోయారు. పురపాలక అధికారులు తాత్కాలికంగా మట్టిపోసినా రెండు రోజుల్లోనే కొట్టుకుపోయిందని ఆరోపించారు. ఏటా టోల్‌పన్నులు చెల్లిస్తున్నా తమకు ఈ గతుకుల రోడ్ల బాధలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల మరమ్మతులు చేపట్టకుండా నెలల తరబడి రహదారులే మూసేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని అంటున్నారు. వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో రోడ్లు బాగుచేయాలని స్థానిక ఎమ్మెల్యేలు అధికారులకు సూచించినా అక్కడక్కడ కంటితుడుపుగా పనులు చేశారని అన్నారు. ఈ విషయంపై అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు.
ఇదీ చదవండి: ప్రారంభం కాని రహదారుల మరమ్మతులు