ఖమ్మం జిల్లా మధిరలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. ముందుగా జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు సీసీఐ కేంద్రాన్ని ప్రారంభించారు. అయితే స్థానిక ఎమ్మెల్యే, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కకు ఆహ్వానం అందించినప్పటికీ.. ఆయన రాకముందే కేంద్రాన్ని జడ్పీ చైర్మన్ ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న బట్టి అసహనంతో మార్కెటింగ్ శాఖ అధికారులపై మండిపడ్డారు.
ప్రోటోకాల్ పాటించటం మీకు తెలియదా అని అధికారులను ప్రశ్నించారు. తనను కార్యక్రమానికి ఆహ్వానించి.. తను రాకముందే హడావిడిగా ఎలా ప్రారంభిస్తారని నిలదీశారు. కంగుతిన్న అధికారులు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఏమీ చెప్పొద్దని, మీ తీరుపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించి.. అక్కడినుంచి వెళ్లిపోయారు.
ఇదీ చూడండి: తండ్రి అంత్యక్రియల కోసం శ్రీకాంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్