Political Parties Election Campaign in Khammam : అభ్యర్థుల ప్రకటన నుంచి ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్న బీఆర్ఎస్ ప్రచారపర్వంలో మరింత దూకుడు పెంచేలా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు.. ఆత్మీయ సమ్మేళనాలు, అంతర్గత భేటీలు, సామాజిక వర్గాల వారీగా సమవేశాలు నిర్వహించి.. అన్ని వర్గాల మద్దతు కూడగట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీ, జిల్లాస్థాయిలో ఎన్నికల సమన్వయ కమిటీలు, బూత్, గ్రామస్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటుచేసి పక్కాగా ప్రచారం నిర్వహిస్తోంది.
Khammam BRS Election Campaign 2023 : ఓటర్లను ప్రత్యేక గ్రూపులుగా ఏర్పాటు చేసి ఆ కమిటీలు నిత్యం వారితో మాట్లాడుతూ ఓట్లు పడేలా చూస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి. సంక్షేమ కార్యక్రమాలను వివరించేందుకు.. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సామాజిక మాధ్యమాలు సహా వివిధ రూపాల్లో గ్రామాల్లో విస్తృతప్రచారం చేస్తుండగా రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలను అభ్యర్థులు ముమ్మరం చేశారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం చేసిన పనులపై ప్రత్యేక కరపత్రాలు రూపొందించి ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ 5 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈనెల 13, 21న మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించేలా ప్రణాళికలు చేస్తున్నారు.
Congress Election Campaign in Khammam 2023 : గత ఎన్నికల్లో జిల్లాలో అధిక స్థానాల్లో విజయం దక్కించుకున్న కాంగ్రెస్.. ఈసారి మెజారిటీ స్థానాలపై కన్నేసింది. బలమైన కార్యకర్తల దండు ఉన్న పార్టీకావడం.. హస్తం పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి ముఖ్యనేతలు రావడంతో రెట్టించిన ఉత్సాహంతో.. కదనరంగంలో దూసుకెళ్తోంది. అభ్యర్థుల లెక్కలు తేలడంతో ప్రచార పర్వంపై ప్రత్యేక దృష్టి సారించేలా వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే ఖరారైన అభ్యర్థులు నియోజకవర్గాలని చుట్టేస్తున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీల హామీలను వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు.
ఖమ్మం రాజకీయం రసవత్తరం ప్రచారపర్వంలో పార్టీల దూకుడు
బీఆర్ఎస్కి కౌంటర్లు ఇచ్చేలా ప్రత్యేక పాటలు : కాంగ్రెస్ హామీలు, రాహుల్ గాంధీపై పాటలతో ప్రచార రథాలను రంగంలోకి దించారు. బీఆర్ఎస్ అభివృద్ధి నినాదానికి కౌంటర్లు ఇచ్చేలా ప్రత్యేక పాటలు రూపొందించి.. ప్రజలకు వివరిస్తున్నారు. నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత ప్రచార సభలు, రోడ్ షోలు, క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని.. మరింత ఉద్ధృతం చేయనున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇతర ముఖ్యనేతలతో పాటు, ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకగాంధీలతో రోడ్ షోలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
గెలుపు బాటలో అభ్యర్థుల హోరాహోరీ-పాదయాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఓట్ల వేట
BJP Leaders Election Campaign in Khammam : గతంలో అధిక స్థానాలు గెలిచిన చరిత్ర ఉన్న వామపక్షాలు ఈసారి చట్టసభల్లో కమ్యూనిస్టుల అవసరం ఉందన్న నినాదంతో ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించిన సీపీఎం 8 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. కొత్తగూడెం, పినపాకలో అభ్యర్థిని ప్రకటించలేదు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. పాలేరు బరిలో నిలవనున్నారు. కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా కొత్తగూడెం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తున్నారు.
రెండు పార్టీలు తొలుత బీఆర్ఎస్.. ఆ తర్వాత కాంగ్రెస్‌తో పొత్తుపై చర్చోపచర్చలు, సంప్రదింపులు చేశాయి. చివరకు సీపీఐ-కాంగ్రెస్ పొత్తు పొడిచినా.. సీపీఎం-కాంగ్రెస్ స్నేహం ఫలించలేదు. బీజేపీ, బీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యమని ప్రజల్లోకి వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. బీజేపీ ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మిగిలిన ఐదు చోట్ల జనసేనతో కొన్నిస్థానాలు పంచుకునేందుకు సిద్ధమవుతోంది. బీజేపీ ముఖ్యనేతలు, జనసేన అధినేత పవన్ రోడ్ షోలు నిర్వహించేలా ఆ పార్టీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
ఖమ్మంలో దొంగ ఓట్ల వ్యవహారం - తుమ్మల, పువ్వాడ మధ్య మాటల తూటాలు
ఖమ్మంలో రాజకీయ కాక - సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్