All Parties Started Election Campaign From Khammam : ఉమ్మడి ఖమ్మం జిల్లా వేదికగా చోటుచేసుకుంటున్న రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. అన్ని జిల్లాలకన్నా ముందే ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రాజకీయ పరిణామాలు రంజుకున్నాయి. జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో ఈ ఏడాది ఆరంభంలోనే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ... ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
ఆ తర్వాత తెలుగుదేశం సైతం ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించగా... ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. వ్యవసాయ కార్మిక సంఘం బహిరంగ సభ పేరుతో సీపీఎం భారీ బహిరంగ సభను ఇక్కడే నిర్వహించి..... వచ్చే ఎన్నికలకు శంఖారావం పూరిస్తున్నట్లు ప్రకటించింది. కొత్తగూడెం వేదికగా ప్రజాగర్జన పేరిట సభ నిర్వహించిన సీపీఐ.. వచ్చే ఎన్నికలకు ఈ బహిరంగ సభ నాందిగా పేర్కొంది.
దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం ఖమ్మం గుమ్మం నుంచే రాజకీయ సైరన్ మోగించేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో జరిగిన భారీ బహిరంగ సభలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరైనప్పటికీ.. ఈ నెల 15న ఖమ్మం వేదికగా నిర్వహించనున్న బహిరంగ సభను కమలదళం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పార్టీకి బలం లేదన్న చోటే సత్తా చాటాలని ప్రణాళిక రచిస్తోంది. అందులో భాగంగానే ఈ నెల 15న నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని సంకల్పిస్తోంది.
పాలేరు అసెంబ్లీ, నేలకొండపల్లి మండలంలో జరగబోయే సభ ఏర్పాటు కార్యక్రమంపై బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, రాష్ట్ర నాయకుడు బొక్క వేణుగోపాల్..... జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. వచ్చే నెలలో కొత్తగూడెంలో మరో సభ నిర్వహించాలని కమలం నేతలు యోచిస్తున్నారు. ఆ సభకు ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు ఇప్పటినుంచే కసరత్తులు చేస్తున్నారు. ఒక నెల వ్యవధిలోనే ఇద్దరు అగ్రనేతల పర్యటనతో పార్టీ నేతలు, శ్రేణుల్ని ఎన్నికల క్షేత్రంలోకి దించేలా భాజపా కసరత్తులు చేస్తుంది.
ఉమ్మడి జిల్లాలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తోంది. పీపుల్స్ మార్చ్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర సైతం ఖమ్మంలోనే ముగియనుంది. ఈ నెల 24వ తేదీన కూసుమంచిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం దాదాపు ఖాయమైంది. రెండు, మూడ్రోజుల్లో ఈ మేరకు పొంగులేటి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ సభలోనే పొంగులేటి హస్తం పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం ఉంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు రానున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: