Podu lands issues: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 97 వేల 719 మంది సాగుదారులు 3 లక్షల 28 వేల ఎకరాల్లో పోడు భూముల హక్కుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అర్హులైన వారు ఎవరు..? సాగుదారుల్లో కనిష్టంగా, గరిష్టంగా ఎన్నిఎకరాల్లో సాగు చేసుకుంటున్నారు.? ఎంతకాలంగా పోడు సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు...? తదితర అంశాలు తేల్చడంతో పాటు గ్రామాల వారీగా పోడు సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీలు సైతం నియమించారు. మూణ్నెళ్లుగా ఆ అంశం అతీగతీ లేదు. త్వరలోనే హక్కు పత్రాలు వస్తాయని గంపెడాశతో కళ్లు కాయలు కాసేలా సాగుదారులు ఎదురుచూస్తున్నారు. నెల రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో పరిణామాలతో గంభీరమైన వాతావరణం కనిపిస్తోంది.
గతంలో సాగు చేసుకున్న భూముల జోలికి రాబోమని, కొత్తగా పోడు చేయొద్దని అటవీ యంత్రాంగం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. పంటలు కోత పూర్తయినందున ఖాళీగా ఉన్న భూముల్లో అటవీ అధికారులు వ్యూహాత్మకంగా పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. వర్షాధారిత పంటలు సాగు సమీపిస్తుండటంతో పోడు భూముల్లో ట్రెంచి కొట్టడం, సరిహద్దులు నిర్ణయించడం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. హక్కులు కల్పిస్తామని చెప్పి అన్యాయంగా భూములను లాక్కుంటున్నారని బాధితులు వాపోతున్నారు.
ఖమ్మం జిల్లాలోని 10 మండలాలు, భద్రాద్రి జిల్లాలోని దాదాపు 15 మండలాల్లో అటవీశాఖ అధికారుల చర్యలు దడ పుట్టిస్తున్నాయి. ట్రెంచి కొట్టేందుకు జేసీబీలు, ప్రోక్లెయిన్లతో ట్రెంచి కొట్టేందుకు యత్నించగా పలుచోట్ల సాగుదారులు అడ్డుకుంటున్నారు. ప్రతిఘటన ఎదురైన చోట పనులు నిలిపేసి యథావిథిగా చర్యలు చేపడుతున్నారు. అటవీ అధికారుల తీరుపై సాగుదారులు, వామపక్ష నేతలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. 2005తర్వాత పోడు చేస్తున్న భూములనే స్వాధీనం చేసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. పరిస్థితి మరింత జఠిలం కాకముందే ప్రభుత్వం చొరవ చూపి పోడు భూముల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇదీ చూడండి: