శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు శివరాత్రి. ఈ పర్వదినాన శివునికి వివిధ రూపాల్లో భక్తులు పూజలందిస్తారు. శివరాత్రి రోజున నిత్య పూజలు, ఉపవాసాల దీక్షలు, నైవేద్యాలు కనిపిస్తాయి. కానీ.. దాదాపు 600 ఏళ్ల చరిత్ర ఉన్న ఓ పురాతన శివాలయంలో వింత ఆచారం కొనసాగుతోంది. శివరాత్రి రోజున మద్యం, మాంసం ముట్టొద్దన్న ఆచారం అక్కడ ఏమాత్రం చెల్లదు.
ఓ వైపు శివదర్శనాలు సాగుతుంటే.. మరోవైపు... పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశాల్లో జోరుగా మద్యం, మాంసాహారంతో భక్తులు పండుగ చేసుకుంటారు. చనిపోయిన వారికి పిండప్రదానం చేస్తుంటారు. తలనీలాలు సమర్పిస్తారు. ఇంత వింత ఆచారానికి కేంద్రమైన ఆ ప్రదేశం ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారా... అయితే ఖమ్మం జిల్లాలోని తీర్థాలలో కొలువైన సంగమేశ్వరుడి సన్నిధికి వెళ్లాల్సిందే.