రాష్ట్రంలో ఎస్సీలకు సముచిత స్థానం కల్పించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఖమ్మం ఎంపీ, తెరాస లోక్‌సభ పక్షనేత నామ నాగేశ్వరరావు అన్నారు. సీఎం దళిత సాధికారత పథకం ఓ బృహత్తర పథకమని కొనియాడారు. ఈ పథకం ద్వారా ఎస్సీల్లోని నిరు పేదలను అర్హులుగా ఎంపిక చేసి వారికి ఎక్కడా దళారీ వ్యవస్థకు అవకాశం లేకుండా సమగ్ర విధానంతో పథకాన్ని రూపొందించడం గొప్ప విషయమన్నారు.
స్వీయ ఆర్థిక సాధికారత కోసం వారి నిర్ణయాధికారాన్ని గౌరవిస్తూ రూపొందించిన పథకమని ఆయన తెలిపారు. అర్హులైన వారికి, లబ్ధిదారులకు సీఎం దళిత సాధికారత పథకం ద్వారా ఒక కుటుంబం ఒక యూనిట్‌గా పరిగణించి ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఒక్కో యూనిట్‌కు రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఎస్సీల సంక్షేమమే లక్ష్యంగా అఖిల పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించి ప్రతిపక్షాలు సైతం హర్షం వెలిబుచ్చేలా పథకాన్ని రూపొందించారని నామ అన్నారు.
మొదటి దశలో 11,900కుటుంబాలకు చేయూత...
సీఎం కేసీఆర్ మానసపుత్రికగా నిలిచిపోనున్న ఈ పథకంలో భాగంగా మొదటి దశలో 119 అసెంబ్లీ స్థానాల నుంచి ఒక్కో నియోజకవర్గానికి 100 కుటుంబాలను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 11,900 కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందించేలా సీఎం కేసీఆర్ ఒక సమగ్ర విధానాన్ని రూపొందించారని అన్నారు. ఇందుకు గాను రూ.1,200 కోట్లతో ఈ పథకం ప్రారంభించారని వివరించారు. రైతుబంధు పథకం లాగే నేరుగా వెనుకబడిన కుటుంబాల చెంతకే ఆర్థిక సాయం అందజేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
ఎస్సీల జీవితాల్లో గుణాత్మక మార్పునకు నాంది...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయబోతున్న సీఎం దళిత సాధికారత పథకం ఎస్సీల జీవితాల్లో గుణాత్మక మార్పునకు దోహదం చేయనుందని నామ నాగేశ్వరరావు తెలిపారు. ఎస్సీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన కొనియాడారు.
వారికి వెన్నుదన్నుగా నిలిచే పథకం
ఈ పథకం అమలుతో వారి జీవితాలు మరింత గొప్పగా మారుతాయని అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ వర్గానికి వెన్నుదన్నుగా నిలిచేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచి, వారి ఆలోచనా దృక్పథంలో గుణాత్మక మార్పులకు నాంది పలకాలనీ ఆకాంక్షించారు. ఈ బృహత్తర పథకంలో భాగస్వామ్యం పంచుకోవాలనే సదుద్దేశంతో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రికి ఎస్సీల పట్ల ఉన్న ప్రేమాభిమానాలకు మరోసారి చాటుకున్నారని నామ నాగేశ్వరరావు కొనియాడారు.
ఇదీ చూడండి: Nama: ఈడీ విచారణకు హాజరు కానున్న ఎంపీ నామ నాగేశ్వరరావు