మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి మృతి రాష్ట్రానికి, పార్టీకి తీరని లోటని తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సీఎం కేసీఆర్‌కి నాయిని కుడి భుజంగా ఉన్నారనీ, ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. నాయిని చిత్రపటానికి ఎంపీ, సండ్ర పూల మాల వేసి నివాళులర్పించారు.
కార్మిక నాయకుడిగా
కార్మిక నాయకుడిగా పోరాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి నాయిని నరసింహారెడ్డి అని నామా కొనియాడారు. భౌతికంగా ఆయన లేకపోయినా ప్రజల గుండెల్లో నిలిచిపోతారని పేర్కొన్నరు. మంచి నాయకుడిని కోల్పోవటం బాధాకరమని ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేశారు.
సంతాప సభలో మున్సిపల్ ఛైర్మన్ మహేష్, డీసీసీబీ డైరెక్టర్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: దగ్గర పడుతున్న గడువు... ధరణి సాగేనా సాఫీగా..?