ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించేలా తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇల్లందు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
ఉద్యోగాల కల్పనలో తెరాస ప్రభుత్వం విఫలమైందన్న ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవమని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. గడిచిన ఆరేళ్ల కాలంలో ఉపాధ్యాయ, పోలీస్, పంచాయతీ కార్యదర్శులు సహా వివిధ విభాగాలలో నియామకాలు చేపట్టామని వివరించారు. నిరుద్యోగ భృతి కూడా తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో ఉందన్న ఆయన కొవిడ్ కారణంగా రాష్ట్ర ఖజానాపై భారం పడడంతో అమలులో జాప్యం జరుగుతోందని తెలిపారు. 60 ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలు కేవలం ఆరేళ్లలో పరిష్కారం కావన్న రాజేశ్వర్ అయినా ప్రతీ సమస్యను తీర్చడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగు నీరు వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో పలువురు ప్రైవేట్ కళాశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు కరోనా కారణంగా ఇబ్బందులు పడుతోన్న తమను ఆదుకోవాలని కోరారు. ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియ, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తన పోలీస్ గారాలపట్టికి.. పోలీస్ నాన్న సెల్యూట్!