అన్ని ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తిగా విభిన్నమైనది. 2015 మార్చి 23 న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 49.91 శాతం నమోదైంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఖమ్మం జిల్లాలో మొత్తం 84, 284 మంది ఓటర్లు ఉండగా.. 42,069 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 49.91 గా నమోదైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,04, 364 మంది ఓటర్లు ఉంటే.. 56,939 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ జిల్లాలో 54.56 శాతం పోలింగ్ నమోదైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 92, 490 మంది ఓటర్లకు 54, 539 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 58.97 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి అన్ని జిల్లాల్లోనూ ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 5 లక్షల 5 వేల 565మంది ఓటర్లు ఉన్నారు. ఈ సారి ఓటర్లు భారీగా పెరిగినందున పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పార్టీలు సైతం పట్టభద్రులను ఓటర్ల జాబితాలో చేర్చడం, విద్యావంతుల్లోనూ అవగాహన మరింత పెరగడంతో ఈ సారి పోలింగ్ కేంద్రాలకు పట్టభద్రులు తరలివస్తారన్న అంచనాలు నెలకొన్నాయి.
ఈ సారైనా ఓటేస్తారా..
ఇక చైతన్యానికి ప్రతీకగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్లు ప్రతీ ఎన్నికలోనూ తమదైన ముద్రవేస్తారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత 2019లో జరిగిన లోక్సభ ఎన్నికలు, తదనంతరం జరిగిన పురపాలక ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు.. ఇలా ఎన్నికలు ఏవైనా ఓటరు చైతన్యం స్పష్టంగానే కనిపిస్తుంది. ప్రతీ ఎన్నికకు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ క్రమంగా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఓటు వేసేందుకు ఉత్సాహం చూపుతుండటం, గడిచిన ఎన్నికకూ ఆ తర్వాత జరిగే ఎన్నికకు పోలింగ్ శాతం పెరుగుతూ వస్తుంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 86.51 శాతం పోలింగ్ నమోదైంది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ 75.61 శాతంతో ఓటరు చైతన్యం స్పష్టంగా కనిపించింది. 2020లో జరిగిన పురపాలక ఎన్నికల్లోనూ ఉభయ జిల్లాల్లో 86.46 పోలింగ్ శాతం నమోదు కాగా.. భద్రాద్రి జిల్లాలో 80.06 శాతం పోలింగ్ నమోదైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ భారీగానే పోలింగ్ నమోదైంది. అన్ని ఎన్నికల్లో ఓటర్ల చైతన్యం కనిపిస్తున్నా... పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం తక్కువ పోలింగ్ శాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. విద్యావంతులు ఈ సారి కచ్చితంగా అధిక సంఖ్యలో ఓటింగ్ పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రలోభాల పర్వం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ప్రలోభాల పర్వం సాగింది. దాదాపు నెలన్నర రోజుల పాటు జోరుగా ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు, రాజకీయ పార్టీలు..చివరి ప్రయత్నాలను ప్రయోగించారు. ఉభయ జిల్లాల్లో ఓ పార్టీ అభ్యర్థి ఓటుకు వెయ్యి ఇచ్చినట్లు జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. మరికొంత మంది అభ్యర్థులు సైతం పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు తాయిళాలు అందజేసినట్లు తెలిసింది.
ఇదీ చూడండి: నేడే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమరం