ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం ప్రజాఉద్యమం రావాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ... ఖమ్మం జిల్లాలోని డోలమైట్ కార్మికులు చేపట్టిన రిలే నిరహార దీక్షలకు సంఘీభావం తెలిపారు. భాజపా ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా తన కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టాలని కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు. రూ. 2లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు పరిశ్రమను రూ.23,135 కోట్లకు తెగనమ్మే కుట్రను అడ్డుకోవాలని అన్నారు.
ఎందరో త్యాగాల ఫలితంగా విశాఖ ఉక్కు పరిశ్రమ సాధించామని అన్నారు. నేడు దాని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వామపక్షాలు ప్రజా ఉద్యమాన్ని నడిపిస్తున్నాయని తెలిపారు. దీనికి మద్దతుగా రావల్సిన ఆంధ్రప్రదేశ్‌లోని పాలక, ప్రతిపక్ష పార్టీలు అధికార స్వార్ధం కోసం మీనామేషాలు లెక్కిస్తున్నాయని విమర్శించారు.
ఇదీ చదవండి: నడ్డా సమక్షంలో భాజపాలో చేరిన శ్రీశైలం గౌడ్