ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కొండ పోచమ్మ కాలువ పనులు నాసిరకంగా చేసినందుకే కాలువకు గండి పడిందని కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క తనపై ఆరోపణలు చేస్తున్నారని, అయితే తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి రావడం వల్ల తన మీద లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.
కొండ పోచమ్మ పనులు చేసింది నల్గొండ జిల్లాకు చెందిన ఉపేందర్ రెడ్డి అని.. తనకు కొండపోచమ్మ కాలువ పనులతో సంబంధం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ పోచమ్మ పనులు తాను చేసినట్టు కాంగ్రెస్ నాయకులు రుజువు చేస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. రైతుబంధు భవనం, ఆయుర్వేద ఆస్పత్రికి తన సొంతంగా రూ.10 లక్షలు ఇచ్చినట్టు ఉపేందర్ రెడ్డి తెలిపారు. చేతనైతే ప్రజలకు మంచి చేయాలి కానీ.. అర్థం లేని ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు.
ఇదీ చదవండి: మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్