గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలో రూ.30 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు.
పల్లెప్రగతిలో భాగంగా కొత్తూరు అన్ని విధాలా అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామంలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులను నిర్వహిస్తూ.. నాటిన ప్రతి మొక్కనూ బతికించే చర్యలు చేపట్టాలని గ్రామస్థులకు సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు.
జిల్లాలోని ప్రతి పంచాయతీకి కొత్తూరు గ్రామం ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం నీటి ట్యాంకర్ను ప్రారంభించి.. పల్లెప్రగతిలో భాగంగా రహదారి పక్కన నాటిన మొక్కలకు నీళ్లు పట్టారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు కూసంపూడి రామారావు, సర్పంచులు బొగ్గు విజయలక్ష్మి, జక్కుల ప్రభాకర్, వాసు రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, ఎంపీడీవో జ్యోష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అతివల అందానికే కాదు ఆపదలోనూ రక్షించే రింగు