ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని అయ్యగారి పేట సొసైటీలో ఏర్పాటు చేసిన నియంత్రిత సాగు విధానం సదస్సులో స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో సొసైటీ అధ్యక్షుడు చల్లగుండ్ల కృష్ణయ్య ఆధ్వర్యంలో వానాకాలం పంటసాగుపై అవగాహన సదస్సు జరిగింది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేందుకే ముఖ్యమంత్రి కొత్త సాగు విధానానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే అన్నారు. రైతాంగాన్ని ఒక మెట్టు ఎక్కించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ అనేక సంస్కరణలు చేస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో పది లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని అన్నారు. రైతులు పండించిన ధాన్యం వృధా కావొద్దని.. లాక్డౌన్ సమయంలో కూడా 3.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం చేసిందని ఆయన గుర్తు చేశారు. రైతులంతా పాత పద్ధతిలో సాగు చేయకుండా.. కొత్త సాగు విధానాన్ని పాటించాలని, ముఖ్యమంత్రి సూచనలు పాటించి రైతులు లాభాలు పొందాలని అన్నారు. ఎమ్మెల్యే సమక్షంలో సొసైటీ అధ్యక్షుడు చల్లగుండ్ల సత్యనారాయణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.పదివేలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ మీనన్, జడ్పీటీసీ సభ్యుడు రామారావు, ఆత్మ ఛైర్మన్ హరికృష్ణరెడ్డి మున్సిపల్ ఛైర్మన్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: గొర్రెకుంట హత్యల నిందితునికి 14 రోజుల రిమాండ్