mirchi crop price issues : అమ్మబోతే అడవి.... కొనబోతే కొరివి.... అన్నచందంగా మారింది మిర్చి రైతుల పరిస్థితి. మార్కెట్‌లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయని కోటి ఆశలతో పంటను అమ్ముకునేందుకు వచ్చిన అన్నదాతలు.. వ్యాపారుల మాయాజాలంతో దగాపడుతున్నారు. పంట రానంత వరకు ఊరించే మద్దతు ధర... మిర్చి రాకతో మార్కెట్ కిటకిటలాడితే మాత్రం అమాంతం పడిపోతుంది. ఫలితంగా ఖమ్మంలో వ్యాపారులకు కాసులు కురిపిస్తున్న మిర్చి కొనుగోళ్లు.. మట్టిమనిషికి మాత్రం తీరని వేదన మిగిలిస్తున్నాయి.
మార్కెట్‌కు కొత్త పంట
Khammam mirchi crop market news : ఖమ్మం మిర్చి మార్కెట్‌కు కొత్త మిర్చి రాక మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాకుండా.. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సైతం మార్కెట్‌కు మిర్చీ వస్తోంది. దీంతో వ్యాపారుల మాయాజాలం మరింత తీవ్రమవుతోంది. మార్కెట్‌కు మిర్చి రాని రోజుల్లో అత్యధిక ధరలు పెట్టి.. తీరా భారీగా బస్తాలు వస్తే మాత్రం... సాకులు చెబుతూ ఇష్టానుసారంగా కొనుగోళ్లు చేస్తున్నారు. వ్యాపారుల మాయాజాలంతో మిర్చి రైతు మరింత కుదేలవుతున్నారు. వారంరోజులుగా ఖమ్మం మార్కెట్‌లో నెలకొన్న చిత్ర విచిత్ర పరిస్థితులు రైతుల దీనగాథలకు అద్దం పడుతున్నాయి. ముఖ్యంగా ధరల దగాతో మిర్చి రైతు చిత్తవుతున్నాడు. రైతుల్ని ఊరించేందుకు మార్కెట్‌కు మిర్చి తక్కువగా వచ్చిన రోజున అధిక ధరలకు కొంటున్నట్లు మభ్యపెడుతున్న వ్యాపారులు.. తాకిడి పెరిగితే మాత్రం తమదైన వ్యాపార మాయాజాలం ప్రదర్శిస్తున్నారు.
సంబంధిత కథనం.. khammam chilli farmers protest: నిన్న 20వేలకు కొన్నారు.. ఇవాళ 3,500 తగ్గించారు..
ధరలు ఢమాల్
ఖమ్మం మార్కెట్‌లో మూడ్రోజులుగా మిర్చి రైతులకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. సోమ, మంగళవారాల్లో క్వింటాల్ మిర్చి ధర 19 వేలు పలికితే.. ఆ తర్వాత రోజు నుంచి ఢమాల్‌మంటూ పడిపోయింది. గత రెండ్రోజులుగా క్వింటా మిర్చి కేవలం 15, 16 వేలు మాత్రమే పలుకుతుంది. భారీగా ధర పెరిగిందన్న ఆశతో రైతులు కొత్త మిర్చిని పెద్దఎత్తున మార్కెట్‌కు తీసుకొచ్చారు. ఖరీదుదారులు జెండా పాట 16 వేలకు పాడగా... ధర అక్కడివరకే ఆగిపోవడం రైతుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఒక్కరోజులోనే ఏకంగా క్వింటా మిర్చికి 3 వేలు ధర తగ్గడంపై అన్నదాతలు భగ్గుమంటున్నారు. మిర్చి ధరలు కావాలనే తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత కథనం: మిరపలో అంతుచిక్కని తెగులు... పెట్టుబడైనా దక్కదని రైతుల ఆవేదన
చర్యలు తీసుకోవాలి..
మార్కెట్‌లో వ్యాపారుల మాయాజాలంపై అధికారులు, పాలకవర్గం ఇప్పటికైనా దృష్టి సారించి.. తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. జెండా పాట సక్రమంగా అమలయ్యేలా చూడటంతో పాటు సరైన గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: Chilli crop: 'మిరప పంట ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్'