త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తెరాస హవా కొనసాగించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఖమ్మం, మధిర నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎన్నిక ఏదైనా తెరాస విజయం ఖాయమని.. రాబోయే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ విజయ ఢంకా మోగిస్తుందని.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి విజయం నల్లేరు మీద నడకనే అని ఆయన అన్నారు. గ్రామస్థాయిలో పార్టీ కార్యకర్తలు, క్రియాశీలకంగా పనిచేసేలా నాయకులు బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో తెరాస విజయం కొరకు ప్రతి ఒక్కరు కష్టపడాలన్నారు. పట్టభద్రుల అభిమానం పొందేందుకు పార్టీ శ్రేణులు గ్రామస్థాయిలో పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ నెల 25 తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలకు చెందిన గ్రామ, మండల ఇంఛార్జిలతో కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి: వ్యవసాయబిల్లును వ్యతిరేకించండి.. తెరాస ఎంపీలకు సీఎం ఆదేశం