తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే మొదటి ప్రాధాన్యతగా పని చేస్తున్నదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా మధిర మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రానున్న రోజుల్లో దేశానికి తిండి పెట్టే రాష్ట్రాల్లో తెలంగాణ ముందు నిలుస్తుందని మంత్రి తెలిపారు. ఐక్యరాజ్య సమితి సైతం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను అభినందించినట్లు పేర్కొన్నారు. మార్కెట్ కమిటీలు రైతులకు అండగా ఉండాలని సూచించారు. జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు నాయకత్వంలో మధిర నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని వివరించారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ నాగేశ్వరరావు, వైస్ ఛైర్మన్ రవి పాలకమండలి సభ్యులతో మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకు ముందు పురపాలక పరిధిలో ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మించిన పార్కు, జిమ్, తహశీల్దార్ కార్యాలయం అంబేద్కర్ కూడలి వద్ద నిర్మించిన బయో మరుగుదొడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ స్నేహలత, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు తదితరురలు పాల్గొన్నారు. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి పువ్వాడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీచదవండి: వాగులో గల్లంతైనవారి మృతదేహాలు లభ్యం