ఖమ్మం జిల్లా సింగరేణి మండలం తవిసి బోడు, విశ్వనాథ పల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కలిసి ప్రారంభించారు. కొవిడ్ విపత్కర సమయంలోనూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తోందని మంత్రి అజయ్‌కుమార్ పేర్కొన్నారు. జులై 1 నుంచి 10వ తేదీ వరకు జరిగే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని గ్రామగ్రామాన విజయవంతం చేయాలని కోరారు. తాను ఖమ్మం జిల్లాలోని అన్ని మండలాలను ఆకస్మిక పర్యటన చేస్తానని.. ఏ మండలానికి వచ్చే విషయాన్ని ఆ రోజు ఉదయం అధికారులకు తెలియజేస్తామని వెల్లడించారు.
రాష్ట్రంలో అద్భుతమైన పథకాలు అమలవుతున్నాయని మంత్రి అన్నారు. గర్భిణి మహిళలకు కేసీఆర్ కిట్లను సర్కారు అందిస్తోందన్నారు. ఖమ్మంలో ఒక మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనివ్వగా... వారికి 36వేల రూపాయల నగదు, మూడు కేసీఆర్ కిట్లను అందజేసినట్లు మంత్రి చెప్పారు. ఒకప్పుడు ఒక్క ఎరువుల బస్తా కోసం రైతులు పోలీసులతో లాఠీ దెబ్బలు తిని తెచ్చుకునే పరిస్థితి ఉండేదని... నేడు రైతు బంధు వంటి పథకాలతో రైతులకు వ్యవసాయం చేసుకునే అనువైన పరిస్థితులు ఉన్నాయన్నారు. సింగరేణి మండలానికి మెరుగైన వసతులతో ఉండే ఆసుపత్రి కోసం కృషి చేస్తానని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ చేసిన విజ్ఞప్తి మేరకు మంత్రి అజయ్‌కుమార్ స్పందించారు.
ఇదీ చదవండి: విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదు: విద్యాశాఖ