ఖమ్మం జిల్లాలో మున్సిపాలిటీలుగా మారిన వైరా, మధిర, సత్తుపల్లిలో సమస్యలు స్థానికులను సతమతపెడుతున్నాయి. మేజర్ గ్రామపంచాయతీలు.. నగర పంచాయతీలుగా...అనంతరం పురపాలికలుగా మారాయి. జనాభాతో సమస్యలూ పెరుగుతున్నాయి. కానీ అభివృద్ధి మాత్రం జరగటంలేదు.
వైరాలో సైరా అంటున్న సమస్యలు...
ఖమ్మం జిల్లా కేంద్రానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైరా పురపాలికంగా ఆవిర్భవించి తొలిసారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకూ నగర పంచాయతీగా ఉన్న వైరా... మున్సిపాలిటీగా ఆవిర్భవించి ఏడాది గడుస్తున్నా... అభివృద్ధి శూన్యంగానే కన్పిస్తోంది. పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ సమస్యలతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చెత్త సేకరణ కూడా సక్రమంగా లేదు. ప్రస్తుతం 31వేల జనాభాతో 20 వార్డుల్లో 23 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఏడాది గడిచినా... ఇంకా పంచాయతీ స్థాయిలోనే సేవలందుతుండటం వల్ల ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారు. మురుగునీరు నిలిచి దోమలు, పందులు స్వైర విహారం చేస్తున్నా... పట్టించుకునే నాథుడే కరవయ్యాడని వైరా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మధిర మారేదెప్పుడు...?
నగర పంచాయతీగా ఉన్న మధిరను 2018లో మున్సిపాలిటీగా మార్చారు. 31 వేల 990 జనాభాతో 22 వార్డులుగా విభజించిన మధిరలో సమస్యలు ఏటికేడు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పన అందని ద్రాక్షగానే మారింది. ప్రధానంగా చెత్త సమస్య మధిర పట్టణాన్ని వేధిస్తోంది. సరిపడా సిబ్బంది లేక పారిశుద్ధ్య నిర్వాహణ దారుణంగా తయారైంది. నాలుగు విలీన గ్రామాలైన మడుపల్లి, అంబారిపేట, ఇల్లందులపాడు, దిడుగుపాడు గ్రామాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సత్తుపల్లిలో స్వచ్ఛత కరవేనా...?
నియోజకవర్గంగా అభివృద్ధిలో ముందంజలో ఉన్న సత్తుపల్లి పట్టణంలో సమస్యల చిట్టా భారీగానే ఉంది. 24 వేల 767 మంది ఓటర్లతో ఉన్న సత్తుపల్లిలో 23 వార్డులున్నాయి. సత్తుపల్లి మున్సిపాలిటీలో డంపింగ్ యార్డు ఇప్పటికీ లేదంటే పారిశుద్ధ్య నిర్వాహణ ఏస్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. దామరచెరువు మినీ ట్యాంకు బండ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వేశ్యకాంతుల చెరువు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాల్సి ఉంది. ఓసి గనుల తవ్వకాల కారణంగా జరుగుతున్న పేలుళ్ల వల్ల ఎన్టీఆర్ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇప్పటి వరకూ సమస్యల వలయంలో ఉన్న పురపాలికల్లో ప్రస్తుత ఎన్నికలతోనైనా మార్పు రావాలని ప్రజలు ఆశిస్తున్నారు. నూతనంగా ఏర్పడబోయే పాలకవర్గాలు ఆయా పట్టణాల అభివృద్ధి బాధ్యతను తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి:వింటే నామినేటెడ్ పదవులు.. లేకుంటే వేటే!