Maize Price Reduced Due to Untimely Rains: ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడిన చందాన తయారైంది. ప్రకృతి బీభత్సానికి నష్టపోయిన అన్నదాతలకు.. ఇప్పుడు మద్దతు ధర కూడా దక్కడం లేదు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు 80 వేల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో రైతులు మక్కలు సాగు చేశారు. అకాల వర్షాలు, వడగళ్ల వాన కారణంగా ఖమ్మం జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగింది.
నెలరోజుల్లోనే ధరలు పతనం: దీనికి తోడు వ్యాపారులు ధరలు తగ్గించారు. గత మార్చి 9న క్వింటా గరిష్ఠ ధర సుమారు రూ.2300 కాగా, సరిగ్గా నెలరోజుల్లోనే దారుణంగా ధరలు పతనమమయ్యాయి. ఇప్పుడు క్వింటా గరిష్ఠ ధర రూ.1700లకు అడుగుతున్నారని.. ఇంకా తగ్గే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. అకాల వర్షం, ఈదురుగాలులతో కింద పడిపోయిన మొక్కజొన్నకు ఇప్పుడు అదనంగా ఖర్చువుతోంది. కింద పడిన పంటను కోసేందుకు ఎకరాకు రూ.8 వేలు వరకు కూలీలకే ఖర్చవుతోంది. కంకిని పొలం నుంచి తీసుకెళ్లడానికి ట్రాక్టర్ ఒక ట్రిప్పుకు రూ.600 అవుతోంది.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి?: మిల్లులకు చేర్చే భారం కూడా రైతులదే. పెరిగిన ఖర్చులు, అకాల వర్షాలతో కర్షకులు కుదేలవుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ధరలు ఇలాగే ఉంటే పెట్టుబడులు సైతం వచ్చే అవకాశం లేదని అన్నదాతలు చెబుతున్నారు. పంట రైతుల వద్ద ఉన్నప్పుడే మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని.. దళారుల చేతికెళ్లిన తర్వాత ప్రభుత్వం కొనుగోలు చేసినా.. రైతులకు ఉపయోగం ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'పత్తి పంట వేస్తే పండలేదు. పత్తి దున్ని మొక్కజొన్న వేశాం. మొన్న కురిసిన అకాల వర్షాలకు మొక్కజొన్న మొత్తం పడిపోయింది. పంట కొయ్యాలంటే కూలీలకు రూ.8 వేలు ఖర్చు అవుతోంది. మొన్నటి దాకా రూ.2200కి కొన్నారు. ఇవాళ కనీసం రూ.1800 నుంచి రూ.1700కి కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నాం'. - రైతులు
ఇవీ చదవండి: