Lack of Rain On Yasangi Cultivation In Khammam District : ఖమ్మం జిల్లాలో యాసంగి సాగుపై(Yasangi Cultivation) వర్షాభావం, పెరిగిన ఖర్చులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సీజన్ ప్రారంభమై నెల గడుస్తున్నా, ఇప్పటి వరకు నామమాత్రంగానే రైతులు పంటలు వేశారు. గత యాసంగిలో సుమారు 3 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు చేశారు. డిసెంబర్ నాటికే సాధారణ విస్తీర్ణంలో 60 శాతం వరకు పంటలు వేశారు. కానీ ఈసారి సాగు విస్తీర్ణం 20 శాతానికి మించలేదు. 2 లక్షల 14 వేల 892 ఎకరాల్లో వరి వేయాల్సి ఉండగా, 48 వేల 91 ఎకరాలకే పరిమితమైంది. మొక్కజొన్న గత ఏడాది ఈ సీజన్‌లో 91 వేల 227 ఎకరాల్లో వేస్తే, ఈసారి ఇప్పటి వరకు 24 వేల 591 ఎకరాల్లోనే సాగు చేశారు.
'ఈసారి వరి వద్దు - ఆరుతడి పంటలే సాగు చేయండి'
"యాసంగిలో పంట వేయాలి అంటే తగినంత నీరు లేదు. వర్షాలు సరిపడా పడలేదు. దీనివల్ల యాసంగిలో పంట వేసే అవకాశం లేకుండా పోయింది. మిరప తోట వేసినా ఖర్చు చాలా అయ్యింది. నల్లి పురుగు బాగా పెరిగిపోయింది. కూలీలు దినసరి కూలీ రేట్లు పెంచారు. గిట్టుబాటు లేని పరిస్థితికి వచ్చింది. ఈ సంవత్సరం పంట వేయకుండా బీడుకు వదిలేయాల్సిందే." - రైతులు
Rain Effect On Yasangi Cultivation : వర్షాభావ పరిస్థితులతో జలశయాల్లో నీళ్లు లేకపోవడం, చెరువుల్లోకి నీరు చేరకపోవడం వల్ల రైతులు పంటలు వేసేందుకు ధైర్యం చేయడం లేదు. సాగర్ జలాలు విడుదల చేసే పరిస్థితి లేకపోవడంతో పంట వేయకపోవడమే మేలనే నిర్ణయానికి వచ్చారు. గడచిన ఖరీఫ్ సీజన్ రైతులకు తీరని నష్టాల్ని మిగిల్చింది. సీజన్ ప్రారంభంలో వర్షాలు లేక రెండుసార్లు విత్తులు విత్తుకోవాల్సి వచ్చింది. మిర్చి, పత్తి ఎక్కువగా సాగు చేశారు. మిర్చిని నల్లి బాగా దెబ్బతీయగా, సరైన వర్షాలు లేక పత్తి దిగుబడి చాలా తగ్గిపోయింది. డిసెంబర్ మొదటి వారంలో మిగ్‌జాం తుపాన్ మరింతగా దెబ్బ తీసింది.
ఊపందుకున్న యాసంగి సాగు- తెలంగాణకు వరుసకట్టిన వలస కూలీలు
"సాగర్ జలాలు విడుదల చేయకపోవడంతో పంట వేయకపోవడమే మేలు. సీజన్ ప్రారంభంలో వర్షాలు లేక రెండు సార్లు విత్తులు విత్తుకోవాల్సి వచ్చింది. మిర్చి సాగు చేస్తే, మిర్చిని నల్లి బాగా దెబ్బతీసింది. సరైన వర్షాలు లేక పత్తి దిగుబడి తగ్గింది." - రైతులు
Yasangi Cultivation : తుపాన్‌కు వరి ఒరిగి కోతలకోసం అదనపు ఖర్చు చేయాల్సి వచ్చింది. వరినారు పోసుకోవడం ఆలస్యమైంది. ఇలాంటి కష్టకాలంలో సాగు చేసి నష్టపోవడం కంటే ఈ సారికీ దూరంగా ఉండటమే మంచిందని రైతులు భావిస్తున్నారు. చీడ పీడలు, ఆకాల వర్షాలను ఎదుర్కొని పంట తీసిన రైతుకు గిట్టుబాటు ధర లేకపోవడం మరింత దెబ్బతీసింది. గత ఏడాది క్వింటా పత్తికి 12 వేల రూపాయలకు పైగా ధర పలికితే ఈ ఏడాది 7వేలు కూడా దాటడం లేదు.
భారత్‌లో చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించిన ఐసీఏఆర్, ఐఐఎంఆర్
సాగర్ ఆయకట్టులో యాసంగి ఆశలు ఆవిరి - ఖమ్మం జిల్లాలో అగమ్యగోచరంగా సాగు పరిస్థితి